ఈరోజే రామ్ చరణ్ ‘పెద్ది’ ఫస్ట్ షాట్ టీజర్ రిలీజ్ అయ్యింది. చరణ్ లుక్, బీజీయమ్, ఆ విజువల్స్, డైలాగ్.. అన్నీ సింప్లీ సూపర్బ్‌గా అనిపించాయి. 2026 మార్చి 27న విడుదల చేస్తున్నారు. రామ్ చరణ్ బర్త్ డే అది. కాబట్టి థియేటర్ల దగ్గర మెగా ఫ్యాన్స్ సందడి మామూలుగా ఉండదు.
అయితే ఒక రోజు ముందు, అంటే మార్చి 26న నాని సినిమా ‘పారడైజ్’ రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించే సినిమా ఇది. ఇటీవల గ్లింప్స్ వదిలారు. నానిని నయా అవతార్‌లో చూసి అందరికీ మెంటలెక్కిపోయింది. ఆ హ్యాంగోవర్ ఇప్పటి వరకూ పోలేదు. పైగా ‘దసరా’ తరవాత శ్రీకాంత్ ఓదెలపై నమ్మకాలు పెరిగిపోయాయి. చిరంజీవికి కథ చెప్పి, ఓకే చేయించుకొన్నాడు. నాని కూడా శ్రీకాంత్ ని బాగా నమ్ముతున్నాడు. ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలు కథలు కథలుగా చెబుతున్నాయి. ఎప్పుడు విడుదలైనా, నానిని మరో రేంజ్‌కి తీసుకెళ్లే కంటెంట్ ఇది అని అంటున్నారు.
ఈ రెండు సినిమాలూ ప్రత్యేకమైనవే. అయితే ఒక రోజు వ్యవధిలో విడుదల అవ్వడం మాత్రం బాక్సాఫీసు పరంగా ఇబ్బంది పెడుతుంది. వసూళ్లు పంచుకోవాల్సివస్తుంది. ‘పారడైజ్’పై నానికి నమ్మకం ఉంది. కాకపోతే.. చరణ్‌కు పోటీకి వెళ్లేంత సాహసం చేస్తాడా అనేదే పెద్ద ప్రశ్న. `పెద్ది` దాదాపు 25 శాతం షూటింగ్ పూర్తి చేసుకొంది. అయితే ‘పారడైజ్’ ఇప్పటి వరకూ సెట్స్‌పైకి వెళ్లలేదు. ఈ సినిమాకు నానినే నిర్మాత. కాబట్టి విడుదల విషయంలో చాలా కేర్ తీసుకొనే అవకాశాలు ఉన్నాయి. తన సినిమాని జనంలోకి తీసుకెళ్లడానికి చాలా కష్టపడతాడు నాని. ‘కోర్ట్’ అనే చిన్న సినిమాకే నాని చాలా జాగ్రత్తపడ్డాడు. అలాంటిది ‘పారడైజ్’పై ఇంకెంత ఫోకస్ చేస్తాడో కదా. రిలీజ్ డేట్ విషయంలో నాని పునరాలోచించినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చరణ్‌కి పోటీకి దిగిపోయినా షాక్ కి గురి అవ్వాల్సిన పనిలేదు. ఇంకా ఏడాది సమయం ఉంది కదా. ఈలోగా ఏదైనా జరగొచ్చు.