అధికారం ఉందని పుంగనూరులో అడుగు పెట్టిన వారందరిపై దాడులు చేయించి ఓ అరాచక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న పెద్దిరెడ్డికి ఇప్పుడు కాలం తిరగబడింది. ఆయన సొంత నియోజకవర్గం వెళ్లడానికి భయపడి పర్యటన రద్దు చేసుకున్నారు. వెళ్తే అంగళ్లులో చంద్రబాబుపై తాను రాళ్లేయించినట్లు ఇప్పుడు టీడీపీ వాళ్లు తనపై రాళ్లేస్తారన్న భయంతో ఆయన ఆగిపోయారు. ఇంత భయం కలిగేలా పుంగనూరులో పరిస్థితులు మారిపోయాయి.
ఎన్నికల ఫలితాల తర్వాత పుంగనూరు రావాలని పెద్దిరెడ్డి అనుకున్నారు. ఈ విషయం తెలిసి కూటమి నేతలు పుంగనూరులో పెద్దిరెడ్డికి అడుగు పెట్టే అర్హత లేదని ర్యాలీ నిర్వహించారు. అతి కష్టం మీద ఆరు వేల ఓట్ల తేడాతో పెద్దిరెడ్డి విజయం సాధించారు. అయినా ప్రభుత్వం పోవడంతో ఆయన బాధితులంతా ఏకమయ్యారు. ఇప్పటికే పోటీ చేసి ఓడిపోయినా టీడీపీ అధికారంలోకి రావడంతో అనధికారిక ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి చల్లా బాబు వ్యవహరించడం ప్రారంభించారు. పోలీసు అధికారులెవరూ పెద్దిరెడ్డికి అనుకూలంగా పని చేసే పరిస్థితి లేదు. దాడులు చేసినా అడ్డుకునేవారు కూడా లేరు.
మరో వైపు పెద్దిరెడ్డి అరాచక అనుచరులు పరారీలో ఉన్నారు. ఓ వంద మంది రౌడీషీటర్లను పోషిస్తూ వారితో కలిసి దాడులు చేస్తూ వస్తున్నారు. ఎవరు ఎదురు మాట్లాడితే వారిపై దాడులు చేసేవారు. చివరికి చంద్రబాబునూ వదల్లేదు. ఈ పాపాలన్నీ పండే పరిస్థితి రావడంతో ఆయన పుంగనూరులో అడుగు పెట్టడానికి భయపడుతున్నారు.