వైసీపీలో పెద్దిరెడ్డి ఎక్కడా కనిపించడం లేదు. సోషల్ మీడియా కేసుల్లో అరెస్టవుతున్న వారిని కాపాడేందుకు జగన్ సీనియర్ నేతలతో ఓ టాస్క్ ఫోర్స్ ను జిల్లాల వారీగా వేశారు. అందులో పెద్దిరెడ్డి కానీ ఆయన ఫ్యామిలీలో పదవులు పొందిన వారు కానీ కనిపించలేదు. పెద్దిరెడ్డికి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినా ఆయన బాధ్యతలు తీసుకోకపోవడంతో చివరికి భూమన కరుణాకర్ రెడ్డికి ఇచ్చారు. పెద్దిరెడ్డి జగన్ తో సమావేశాలకు మాత్రం వస్తున్నారు. ఇక ఏ కార్యక్రమాలకూ హాజరు కావడం లేదు.
పెద్దిరెడ్డి కుటుంబం అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసిన ఘోరాలు.. కబ్జాలు అన్నీ బయటకు వచ్చాయి. అదే సమయంలో చాలా కాంట్రాక్టులు కూడా ఉన్నాయి. వాటిలో చేసిన నిర్వాకాలు కూడా అలాగే ఉన్నాయి. అందుకే పెద్దిరెడ్డి సైలెంటుగా ఉంటున్నారు. రాజకీయంగా తాము కొంతకాలం సైలెంటుగా ఉంటామన్న సంకేతాలను పంపారని అంటున్నారు. చంద్రబాబు సాయంతో ఆర్థికంగా నిలదొక్కుకున్న ఆయన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కుప్పంలోనే ఓడిస్తానని సవాల్ చేసి వందల కోట్లు ఖర్చు పెట్టారు.
పాపాల పెద్దిరెడ్డి సంగతి చూస్తానని పాదయాత్రలో నారాలోకేశ్ కూడా ప్రకటించారు. తన పరిస్థితి ముందుగానే అర్థం కావడంతో మైనింగ్ కు సంబంధించిన దాదాపుగా వందలారీలతో పాటు ఖరీదైన సామాగ్రిని ఫలితాలు రాక ముందు ఆఫ్రికా తరలించేశారు. అక్కడ మైనింగ్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు జైలుకు వెళ్లకుండా ఉండాలన్నా…. ఆర్థికంగా దెబ్బపడకుండా ఉండాలన్నా కాస్త సైలెంటుగా ఉండాలని అనుకుంటున్నారు. అది జగన్ కు సమస్యగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.