వైసీపీలో జగన్ రెడ్డి చెప్పిందే వేదం కావొచ్చు కానీ చిత్తూరు జిల్లాలో మాత్రం మంత్రి పెద్దిరెడ్డినే వైసీపీ చీఫ్. ఆయన ఎవరికి టిక్కెట్లు ఇవ్వమంటే వారికి ఇవ్వాలి. రిజర్వుడు నియోజకవర్గాల్లో ఇప్పటికే తన మాట జవదాటని వారిని పెట్టుకున్న పెద్దిరెడ్డి జనరల్ నియోజకవర్గాల్లో తన బంధువల్ని నింపేస్తున్నారు. ఈ సారి ఎంపీగా వెళ్లాలనుకుంటున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నలుగురు బంధువులకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పించుకుంటున్నారు. పుంగనూరు నుంచి తన సోదరుడు కుమారుడ్ని నిలబెట్టాలనుకుంటున్నారు.
నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పోటీ చేసే పీలేరు నుంచి కుమారుడు మిధన్ రెడ్డి.. తంబళ్లపల్లె నుంచి సోదరుడు ద్వారకనాథ్ రెడ్డిని, పలమనేరులోనూ మరో సోదరుడ్ని నిలబెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రిజర్వుడు నియోజకవర్గాలు పోను.. మిగతా నియోజకవర్గాల్లోనూ తాను చెప్పిన వారికే టిక్కెట్లు ఇవ్వాలని పెద్దిరెడ్డి పట్టుబడుతున్నారు. నగరిలో రోజాకు టిక్కెట్ ఇవ్వొద్దని ఆయన పట్టుబడుతున్నారు.
అయితే రోజా నోటిని తట్టుకోలేమని వైసీపీ పెద్దలు టిక్కెట్ ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారని అంటున్నారు. ఈ విషయంపై పెద్దిరెడ్డి రాజీ పడితే… రోజాకు టిక్కెట్ వస్తుంది. లేకపోతే లేదని చెబుతున్నారు. మొత్తంగా చిత్తూరు జిల్లా వైసీపీ అంటే.. జగన్ కన్నా పెద్దిరెడ్డే ఎక్కువ అని… సెటైర్లు వినిపిస్తున్నాయి.