మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఈ నెల ఇరవై ఒకటో తేదీ వరకూ ఇంట్లో నుంచి బయటకు రానివ్వొద్దని.. మీడియాతో మట్లాడనివ్వవద్దని ఎస్ఈసీ ఆదేశించింది. ఈ మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్.. డీజీపీ గౌతం సవాంగ్‌కు ఉత్తర్వులు పంపారు. ఎన్నికలు స్వేచ్ఛగా.. ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు నిర్భయంగా ఓటేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఎస్ఈసీ తెలిపింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొద్ది రోజులుగా ఎస్ఈసీ నిమగడ్డ సహా ఉద్యోగులందర్నీ బెదిరించేలా మాట్లాడుతున్నారు. శుక్రవారం రోజు ఆయన ఎస్ఈసీ చెప్పిన మాటలు విన్న అధికారులు.. ఆయన చెప్పినట్లుగా నివేదికలు పంపే అధికారులను మార్చి 31 తర్వాత బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. అదే సమయంలో ఎస్ఈసీ పైనా విమర్శలు చేశారు.
చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన నివేదికలు.. పెద్దిరెడ్డి మాటలను పరిగణనలోకి తీసుకున్న ఎస్ఈసీ ఆయనను ఇంటికే పరిమితం చేయాలని డీజీపీని ఆదేశించింది. వాస్తవానికి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన మొదట్లోనే మంత్రలు బొత్స, పెద్దిరెడ్డి ఎస్ఈసీపై తీవ్రంగా విమర్శలు చేశారు. ఆ వ్యాఖ్యలపైన గవర్నర్‌కు నిమ్మగడ్డ ఫిర్యాదు చేశారు. దాని కోసమే ఎదురు చూస్తున్నట్లుగా వారిద్దరూ ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. నిమ్మగడ్డకు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఎందు కో కానీ పెండింగ్‌లో పెట్టారు. ఆ తర్వాత కూడా పెద్దిరెడ్డి వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల్ని బెదిరించడంతో ఎస్ఈసీకి చాన్స్ ఇచ్చినట్లయింది.
అయితే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగానే కాదు.. ప్రభుత్వంలో ఓ బలమైన నేతగా ఉన్నారు. చిత్తూరు జిల్లాకు సంబంధించినంత వరకూ వైసీపీ అధినేత ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. అధికార వర్గాలు కూడా ఆయనపై చర్యలు తీసుకోవడానికి సిద్ధపడవు. ఇలాంటి పరిస్థితుల్లో డీజీపీ ఏం చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎస్ఈసీ ఆదేశాలు పాటించకపోతే.. డీజీపీ ఇబ్బందులు పడతారు. సీఎస్ రాసినట్లుగా ప్రవీణ్ ప్రకాష్‌పై చర్యలు తీసుకోవాలసిన అవసరం లేదని రాసినట్లుగా… పెద్దిరెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని డీజీపీ లేఖ రాస్తారేమో చూడాలి. ఒక వేళ ఎస్ఈసీ ఆదేశాన్ని పాటిస్తే.. ఇప్పటికే స్వయంగా పెద్దిరెడ్డే హెచ్చరించారు..మార్చి 31 తర్వాత బ్లాక్ లిస్టులో పెడతామని. ఇప్పుడు… అసలు ఇబ్బంది డీజీపీకి ప్రారంభమయింది.