లిక్కర్ స్కాంలో అడ్డంగా దొరికిపోతానని భయపడుతున్న పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి ముందస్తుగా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అసలు బెయిల్ కోసం రావాలి అంటే కేసులు నమోదవ్వాలి కదా.. తన మీద నమోదైన కేసుల వివరాలు చెప్పాలి కదా. ఇక్కడే మిథున్ రెడ్డి తన తెలివి తేటల్ని మరోసారి ప్రదర్శించారు. మద్యం స్కాంపై నమోదైన ఎఫ్ఐఆర్లో తన పేరు ఉందని పత్రికల్లో వచ్చిందట. అందుకే ముందస్తు బెయిల్ కోసం అప్లయ్ చేసుకుంటున్నారట.
తాను ఎంపీనని రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయాలతో తనకు సంబంధం ఉండనది మిథున్ రెడ్డి చెప్పుకొచ్చారు. మద్యం వ్యవహారంతో అసలు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. అయినా ఇలాంటి తెలివి తేటలతో కేసుల నుంచి బయట పడి.. కోర్టుల నుంచి రిలీఫ్ తెచ్చుకుందామని మిథున్ రెడ్డి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఏమైనా సంబంధం ఉంటేనే స్కామ్ చేస్తారా ?. డబ్బులు రూటింగ్ చేసి.. ప్రతి శనివారం జగన్ కు లెక్కలు చెప్పే బాధ్యతను మిథున్ రెడ్డినే తీసుకున్నారని తాడేపల్లి ప్యాలెస్ నుంచే సీఐడీకి సమాచారం వచ్చిందని చెబుతున్నారు. అయినా ఆయన కోర్టు ఎదుట అమాయకత్వం నటించేందుకు ప్రయత్నిస్తున్నారు.
లిక్కకర్ స్కాంలో సీఐడీ దర్యాప్తు జరుపుతోంది కానీ ఇప్పటి వరకూ అరెస్టుల జోలికి వెళ్లలేదు. కీలక విషయాలు బయటపడలేదు. కానీ డిస్టిలరీల నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించారు. ఎంత నగదు ఎలా . కమిషన్ల రూపంలో తరలిపోయిందో గుర్తించారని చెబుతున్నారు. బంగారంగా ఎంత వేల కోట్లు మార్చారో కూడా లెక్కలు తీస్తున్నారు. అసలు బాంబు పేలక ముందే మిధున్ రెడ్డి.. ముందస్తు బెయిల్ కోసం కోర్టుకెళ్లిపోయారు.