అమరావతి రాజధానికి రైతులు ఇచ్చిన భూములను తిరిగి ఇచ్చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. ఉదయమే ప్రెస్‌మీట్ పెట్టిన పెద్దిరెడ్డి… అమరావతి రాజధాని విషయంలో కీలక ప్రకటనలు చేశారు. అమరావతిలో రైతులెవరూ ఆందోళన చేయడం లేదని.. టీడీపీ కార్యకర్తలు మాత్రమే ఆందోళనలు చేస్తున్నారన్న ఆయన.. రైతుల భూములను తిరిగివ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రకటించారు. గతంలో.. జగన్మోహన్ రెడ్డి .. తమ ప్రభుత్వం వస్తే.. రైతుల భూములు తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించినట్లుగా గుర్తు చేశారు. అమరావతికి భూములు రైతులెవరూ స్వచ్చందంగా ఇవ్వలేదని… అప్పటి ప్రభుత్వం లాక్కుందని.. పెద్దిరెడ్డి తేల్చారు.
అమరావతిని లెజిస్టేటివ్ రాజధానిగా ఉంచాలనుకున్నందున.. మొత్తం 300 ఎకరాలు సరిపోతాయన్నారు. తుళ్లూరులో టీడీపీ నేతలు ఏడు వేల ఎకరాలు కొన్నారని.. ఇన్ సైడర్ ట్రేడింగ్‌పై… ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందని చెప్పుకొచ్చారు. విశాఖకు అమరావతిని మార్చే విషయంలో.. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని.. వైసీపీ నేతలు భూములు కొన్న తర్వాతే.. అక్కడ రాజధాని నిర్ణయం తీసుకున్నారన్న ఆరోపణలను పెద్దిరెడ్డి ఖండించారు. విశాఖలో ఇప్పటికే భూముల ధరలు పెరిగాయని… అక్కడ వైసీపీ నేతలెవరూ భూములు కొనలేదని స్పష్టం చేశారు. రాజధాని మార్చడానికి కేంద్రం మద్దతు కావాలి కదా.. అన్న ప్రశ్నకు మంత్రి పెద్దిరెడ్డి మరింత ఘాటుగా స్పందించారు.
మూడు కాకపోతే.. ముఫ్పై రాజధానులు పెట్టుకుంటామని.. అది తమ ప్రభుత్వ ఇష్టమన్నారు. అంతే కానీ.. కేంద్రానికి ఏం సంబంధం లేదన్నారు. కేంద్రం అనుమతి కానీ.. నిధులు కానీ అవసరం లేదని స్పష్టం చేశారు. అమరావతి విషయాన్ని చాలా వేగంగా క్లోజ్ చేసి.. విశాఖకు రాజధానిని తరలించడానికి.. ఏపీ సర్కార్ అడుగులు వేస్తోందని.. తెల్లవారక ముందే మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలను బట్టి స్పష్టమవుతోందంటున్నారు.