ఇసుక కొరతతో ఏపీలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడ్డారనేది నిజం. అడ్డా కూలీల దగ్గర్నుంచి సిమెంట్ కంపెనీల వరకూ.. అందరూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మిగతా వారి సంగతేమో కానీ.. పనులు దొరికితేనే కడుపు నింపుకునేవారి పరిస్థితి మాత్రం దుర్భరం. ప్రభుత్వ నిర్ణయాల వల్లే.. ఈ పరిస్థితి వచ్చిందని పెద్దలకూ తెలుసు. ఇలాంటప్పుడు.. పేదలకు సాయం చేసే విషయం ఆలోచించడం.. మానవత్వం ఉన్న నేతల లక్షణం. కానీ ఏపీ సర్కార్ పెద్దలు మాత్రం.. అసలు సమస్యను గుర్తించడానికే సిద్ధపడటం లేదు. పైగా కూలీల్ని.. కించ పరచడానికి వెనుకాడటం లేదు. ఆంధ్రప్రదేశ్లో కూలీలకు పని లేకపోవడం అనేది సమస్యే కాదని.. ఇసుక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తేల్చేశారు. ఇసుక సమస్యను తక్కువ చేసి.. కూలీల ఆకలి కేకలను… చిన్నబుచ్చేందుకు వెనుకాడటం లేదు. ఈ సీజన్లో పని ఉండదని.. పనిలేకపోవడమనేది సమస్యే కాదని పెద్దిరెడ్డి ప్రకటించారు. ఇసుక సమస్యే వల్లే కూలీలకు పనిదొరకడంలేదన్న వాదన కూడా కరెక్ట్ కాదన్నారు. విపక్షాలు డిమాండ్ చేస్తున్నట్లుగా… రోజు వారీ కూలీలకు సాయం చేసే ఉద్దేశం లేదని తేల్చేశారు.
ఇసుక కొరతపై విపక్ష పార్టీలు పోరాటం ప్రారంభించాయి. తెలుగుదేశం పార్టీ నేతలు… రోజువారీగా పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అదే సమయంలో.. జనసేన అధినేత వచ్చే నెల మూడో తేదీన విశాఖలో భారీ ర్యాలీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇసుక పేరుతో కొందరు డ్రామాలాడుతున్నారని… ఇసుక పాలసీ పారదర్శకంగా అమలు అవుతోందని పెద్దిరెడ్డి తనకు తాను సర్టిఫికెట్ ఇచ్చేసుకున్నారు. పవన్ ఆ తానులోని ముక్కే… అందుకే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్లు ఏమీలేదని.. ఎవరు ఇబ్బంది పడకుండా ఇసుక అందిస్తామని చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి.. రోజువారీ కూలీలు, భవన నిర్మాణ కార్మికులకు పనులు లేకుండా పోయాయి. మొదటి రెండు నెలలు ప్రభుత్వం పూర్తిగా ఇసుక తరలింపును నిషేధించింది. తర్వాత కొత్త విధానం పేరుతో.. మరికొంత ఆలస్యం చేశారు. చివరికి కొత్త విధానం అమలు ప్రకటించారు. కానీ ఇసుక మాత్రం దొరకడం లేదు. దానికి వరదలను కారణంగా చెబుతూ.. వస్తోంది. ఏదైనా ప్రభుత్వ అసమర్థ నిర్ణయాల వల్ల.. ఏపీ నుంచి కూలీలు పెద్ద ఎత్తున వలస పోయారు. పోలేని వాళ్లు ఆకలితో అలమటిస్తున్నారు. అప్పులపాలయ్యారు. ఇవన్నీ ప్రభుత్వానికి తెలియక కాదు. తమ చేతకాని తనాన్ని అంగీకరించలేక… ఏ సమస్యలూ లేవని చెప్పుకొస్తున్నారు.