రెండు మూడు నెలల కిందట అనంతపురంలో వైసీపీనే లేదు …. ఈ మాట అన్నది టీడీపీ నేత కాదు… వైసీపీ అనంతపురం ఇంచార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. హిందూపురంలో ఆరు రోజుల టూర్ పెట్టుకున్న ఆయన అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. తమ అంతర్గత సర్వే గురించి చెప్పకనే చెప్పాల్సి వచ్చింది. రెండు, మూడు నెలల కిందట అనంతపురంలో వైసీపీ పార్టీనే లేదని.. రెండు,మూడు సీట్లలో తప్పగా ఎక్కడా పోటీ ఇచ్చే పరిస్థితే లేదన్నారు. ఇప్పుడు అభ్యర్థులను మార్చడంతో.. రెండు, మూడు స్థానాలు తప్ప అని గెలుస్తామని కవర్ చేసుకున్నారు.
అనంతపురంలో ఇంకా అభ్యర్థుల్ని మార్చలేదు. ఆ ప్రక్రియ సాగుతోంది. అయినా మార్చేసినట్లుగా… వైసీపీ రాత మారిపోయినట్లుాగ పెద్దిరెడ్డి అనుకుంటున్నారు. నిజానికి ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తే.. కులాల పరంగా అభ్యర్థుల్ని నిలబెడితే గెలిచేస్తామని పెద్దిరెడ్డి ఎలా అనుకుంటున్నారో కానీ.. ఓ నిజం మాత్రం ఆయన చెప్పారన్న వాదన వినిపిస్తోంది. అనంతపురం జిల్లాలో వైసీపీ తీవ్ర గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. 2014 ఎన్నికల్లో అనంతలో టీడీపీ స్వీప్ చేస్తే 2019లో వైసీపీకి ఆ చాన్స్ దక్కింది. టీడీపీ అంతర్గత వివాదాల వల్ల ఎక్కువ సీట్లు కోల్పోతే.. వైసీపీ ఎమ్మెల్యేల అవినీతి, ప్రభుత్వ ఘోరాల వల్ల పూర్తిగా వెనుకబడిపోయింది. అయినా ఇప్పుడు బీసీ మహిళకు సీటిచ్చాం… ముస్లిం అభ్యర్థికి సీటిచ్చామని కబుర్లు చెప్పి.. తాము రేసులోకి వచ్చామని చెప్పుకునేందుకు మంత్రి పెద్దిరెడ్డి తాపత్రయ పడుతున్నారు.
మంత్రి పెద్దిరెడ్డి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనంతపురంలో వైసీపీకి చాన్స్ లేదన్నది నిజమేనని.. స్వయంగా సీఎం జగన్ పోటీ చేసినా పుంజుకునే అవకాశం లేదని అంటున్నారు. పతనం ప్రారంభమైన తర్వాత అది పాతాళంలోకి పోయేలా వైసీపీ వ్యవహారశైలి ఉందని… అభ్యర్థుల్ని మారిస్తే.. మరింత మైనస్ అవుతుంది కానీ.. ప్లస్ అయ్యే చాన్స్ లేదని అంటున్నారు.