పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతికి ఆపరేషన్ అయింది. మూడు రోజుల కిందట ఆయన ఇంట్లో జారిపడటంతో చేయి విరిగినట్లుగా గుర్తించారు. దాంతో ఆయనకు వైద్యలు ఆపరేషన్ నిర్వహించారు. ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లిక్కర్ స్కాంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఆయన పేరు ఇంకా ఎఫ్ఐఆర్లోనే లేనప్పుడు ఈ పిటిషన్ ఎలా విచారణార్హం అని ప్రభుత్వ లాయర్ ప్రశ్నించారు . ఆ సమయంలో తన తండ్రికి ఆపరేషన్ అయిందని పరామర్శకు వస్తే అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని వాదించారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో ఉండటం లేదు. ఆయన తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్‌లలో ఉంటున్నారు. ఎక్కడ ఉంటున్నారో అత్యంత సన్నిహితులకే సమాచారం తెలుసు. అయితే ఆయన తిరుపతిలో ఉన్నప్పుడే కిందపడ్డారు. అందుకే అక్కడ చికిత్స చేయించుకున్నారు. మిధున్ రెడ్డి హైకోర్టు మధ్యంతర రిలీఫ్ ఇచ్చింది. తదుపరి విచారణ వరకూ అరెస్టు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. లిక్కర్ స్కాంలో సీఐడీ ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేసినందున కఠిన చర్యలు తీసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తోందని చెబుతున్నారు. ఈ క్రమంలో పెద్దిరెడ్డికి గాయం.. ఆయన కుమారుడికి కోర్టులో రిలీఫ్ వంటివి చర్చనీయాంశంగా మారాయి.
లిక్కర్ స్కాంలో జగన్ తరపున పూర్తి స్థాయిలో పనులు చక్కబెట్టింది మిథున్ రెడ్డి. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలను ఆయన చూసుకున్నారు. నగదుగా వచ్చే బ్లాక్ మనీని వైట్ గా చేసే వ్యూహంలో ఆయనది కీలక పాత్ర అని చెబుతున్నారు. ఇందుకు సంబంధించి సీఐడీకి కీలక ఆధారాలు లభ్యమయ్యాయని కూడా తెలుస్తోంది. ఈ క్రమంలో మిథున్ రెడ్డి ఎక్కువగా ఏపీకి రావడం లేదు. ఢిల్లీలోనే ఉంటున్నారు.