‘పెదకాపు’ సినిమాతో పరిచయం అయ్యాడు.. విరాట్ కర్ణ. ‘పెదకాపు’ హిట్టయితే ‘పెదకాపు 2’ తీసేవారు. కానీ ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో పార్ట్ 2 రాలేదు. ఇప్పుడు తను హీరోగా ఓ కొత్త సినిమా పట్టాలెక్కుతోంది. నిర్మాత అభిషేక్ నామా దర్శకుడిగా మారి ఓ సినిమా తీస్తున్నారు. అదే ‘నాగబంధనం’. సోమవారం ఉదయం హైదరాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ చిత్రంలో విరాట్ కర్ణ హీరో. నభా నటేషా, ఐశ్వర్యమీనన్ కథానాయికలు. మరో హీరోయిన్ కీ చోటుంది. ఆమె పేరు త్వరలో ప్రకటిస్తారు.
సోషియో ఫాంటసీ అంశాలు మేళవించిన కథ ఇది. విజువల్ ఎఫెక్ట్స్ కి పెద్ద పీట వేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలోనే ఈ చిత్రాన్ని రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. టెక్నికల్ టీమ్ కూడా గట్టిగానే ఉండబోతోందని తెలుస్తోంది. ‘పెదకాపు’ తరవాత విరాట్ చాలా కథలు విన్నాడు. కొన్ని కథలు ఓకే కూడా అయ్యాయి. అయితే ‘నాగబంధనం’ కథ మరింత నచ్చడంతో, ఓకే చేసిన కథలు కూడా పక్కన పెట్టి ఈ సినిమాని పట్టాలెక్కిస్తున్నారు.