విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ తరపున అభ్యర్థిగా సీనియర్ నేత బొత్స సత్యనారాయణను జగన్ ఖరారు చేశారు. కూటమి కూడా ఇప్పుడు బొత్సకు ధీటైన అభ్యర్థిని బరిలోకి దింపేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. అనకాపల్లి టీడీపీ నేత పీలా గోవింద్ తో పాటు పెందుర్తి నేత గండి బాబ్జీ కూడా ఎమ్మెల్సీ టిక్కెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. బొత్సను ఢీ కొట్టగలిగిన అభ్యర్థిని ఫైనల్ చేసే అవకాశం ఉంది.
గత ఎన్నికల్లో వైసీపీ తరపున వంశీ కృష్ణ శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి సంపూర్ణమైన మెజార్టీ ఉంది. అందుకే గతంలో టీడీపీ పోటీ పెట్టలేదు . కానీ ఇప్పుడు రాజకీయాలు మారిపోయాయి. వైసీపీ బలం ఎంత అన్నది స్పష్టత లేకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత విశాఖ వైసీపీ నేతలు కూడా సైలెంట్ అయిపోయారు. ఈ కారణంగా విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ గెలుపొందడం అంత తేలిక కాదని భావిస్తున్నారు.
ఘోరమైన ఓటముల తర్వాత రెండు నెలల్లోనే బొత్సకు ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం రావడంతో తన చాణక్యంతో గెలిచి ఆయన ప్రజాప్రతినిధి అవుతారని వైసీపీ ఆశలు పెట్టుకుంది. అయితే కూటమినేతలు మాత్రం.. వైసీపీ ఓటర్లు ఆ పార్టీకి ఓటు వేసేందుకు సిద్ధంగా లేరని.. తమ పార్టీకే ఓటు వేస్తారని నమ్మకంతో ఉన్నారు. అందుకే బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలనుకుంటున్నారు. వైసీపీ నేతలు ఇప్పటికే తమ ఓటర్లను క్యాంపులకు తరిలించే ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.