భారత్‌లో “పెగాసుస్” సాఫ్ట్వేర్ సాయంతో విచ్చలవిడిగా సాగిన నిఘా వ్యవహారం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దగ్గర్నుంచి భారత చీఫ్ జస్టిస్‌గా ఉన్నప్పుడు రంజన్ గొగోయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళ బంధువుల వరకూ అందరిపై నిఘా పెట్టగలిగారు. సీక్రెట్స్ తెలుసుకోగలిగారు. అంటే..ఎవరికీ.. దేశంలో వ్యక్తిగత స్వేచ్చ అనేది లేకుండా పోయింది. ఇదందా “పెగాసుస్”తోనే జరిగింది. ఇదంతా ఎవరు చేశారు..?.
కేంద్రం ఎందుకు భుజాలు తడుముకుంటోంది..!?
పెగాసుస్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం నోరు మెదపడం లేదు. “పెగాసుస్”ను ప్రభుత్వాలకు .. అదీ కూడా ఉగ్రవాదులపై నిఘా పెట్టడానికి మాత్రమే అనుమతిస్తామని ఇజ్రాయెల్ సంస్థ చెబుతోంది.కానీ ఇండియాలో జరిగింది మాత్రం వేరు. రాజకీయ ప్రత్యర్థులందర్నీ… టార్గెట్ చేశారు. జర్నలిస్టుల వ్యక్తిగత వివరాలను సేకరించారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. మీ ఫోన్ కూడా పరిశీలించి ఉండవచ్చన్న అనుమానాలు కూడా రావడం సహజమే. కేంద్ర ప్రభుత్వం పెగాసుస్ అంశంపై తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఒక వేళ ఇది కేంద్ర ప్రభుత్వమే చేస్తే.. అంత కంటే దేశద్రోహం ఉండదు. తమకు సంబంధం లేదని కేంద్రం భావిస్తే.. ఇంతటి దుశ్చర్యకు పాల్పడినవారిని వదిలి పెట్టకూడదు. తక్షణం విచారణ జరిపి.. పెగాసుస్ సాఫ్ట్‌వేర్‌ను ఇండియాకు తీసుకు వచ్చినవారు… నిఘా పెట్టి వ్యక్తిగత వివరాలను సేకరించిన వారు.. వ్యక్తిగత స్వేచ్చపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. కానీ కేంద్ర ప్రభుత్వ తీరు మాత్రం భిన్నంగా ఉంది. భుజాలు తడుముకుంటున్నట్లుగా ఉంది. చట్టాలన్నీ కఠినంగా ఉన్నాయని దేశంలో.. చట్ట విరుద్ధంగా ఎలాంటి నిఘా ఉండదని… కబుర్లు చెబుతున్నారు. ఇలాంటి మాటలతోనే .. కేంద్రంపై ప్రజల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి.
ప్రభుత్వాలను మార్చింది పెగాసుస్ సాయంతోనేనా..!?
బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఎవరికీ స్వేచ్చ లేకుండా పోయింది. ప్రభుత్వాలను గద్దెదించడానికి, నేతలను తమ వైపుకు తిప్పుకోవడానికి పెగాసుస్తో నిఘాను ఉపయోగించుకున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటకలో ప్రభుత్వం కూల్చివేతలో ఈ నిఘా ఉపయోగిపడినట్లుగా ఇప్పటికే మీడియాలో ప్రచారం ఊపందుకుంది. అనేక ప్రభుత్వాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూల్చి వేసింది. నేతల్ని.. తమ వైపునకు తిప్పుకుంది. తమ పార్టీలో చేరేలా చేసుకుంది. ఇదంతా.. వారి వారి వ్యక్తిగత జీవితాల్లోని విషయాలను తెలుసుకుని.. బ్లాక్ మెయిల్ చేయడం ద్వారానే జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇండియాను బద్నామ్ చేస్తోంది ఈ పని చేస్తున్న వాళ్లే..!
కేంద్ర ప్రభుత్వానికి ఓ అలవాటు ఉంది. తాము చేసే తప్పులు బయటపడితే.. దాని గురించి ప్రచారం జరిగితే.. అది ఇండియాను బద్నాం చేయడానికి అంతర్జాతీయంగా చేస్తున్న కుట్ర అని చెప్పుకుని.. దేశంలోని అసంతృప్త గొంతుల్ని అణిచివేయడానికి ప్రయత్నిస్తూంటారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. దీన్నంతా అంతర్జాతీయ కుట్రగా అభివర్ణించి తప్పుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కానీ.. ఇది ఇండియా ప్రతిష్టకు సంబంధించిన అంశం. ఈ పెగాసుస్ వ్యవహారంలో.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం.. ప్రజల హక్కులను కాలరాయలేదని… నిరూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేకపోతే.. ఇండియా ఇమేజ్ ప్రపంచంలో దారుణంగా పడిపోతుంది. అదే అసలైన దేశద్రోహం.