‘ఎవరికీ చెప్పొద్దు’ అనే ఓ డిఫరెంట్ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సంస్థ.. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్. ఇప్పుడు మరో విభిన్నమైన సినిమా తీసింది. అదే.. ‘పేకమేడలు’. వినోద్ కిషన్, అనూష క్రిష్ట జంటగా నటించారు. నీలగిరి మామిళ్ల దర్శకత్వం వహించారు. టీజర్ విడుదలైంది. లక్ష్మణ్ అనే కుర్రాడి కథ ఇది. అతిసాధారణ ఉద్యోగైనా సరే, పైకి గొప్పలు చెప్పుకొంటూ, గాల్లో మేడలు కట్టే క్యారెక్టర్ లక్ష్మణ్ది. తన కథేమిటి? తను చెప్పిన అబద్దాలకు వచ్చిన ప్రతిఫలం ఏమిటి? అనేది తెరపై చూడాలి. టీజర్ ఆత్యంతం నవ్వులు పంచింది. ఆసక్తికరంగానూ ఉంది. ఈ టీజర్‌ని మాస్కా దాస్ విశ్వక్ సేన్ విడుదల చేయడంతో.. మరింత బజ్ ఏర్పడింది. నిర్మాత రాకేశ్ వర్రే మాట్లాడుతూ ”నేను హీరోగా చేసిన ఎవరికీ చెప్పొద్దు.. ఊహించని విజయాన్ని అందుకొంది. మూడు రోజుల్లో తీసేయాల్సిన సినిమా అది. 30 రోజులు ఆడింది. నెట్ ఫ్లిక్స్ ద్వారా మరింత పాపులర్ అయ్యింది. ఈసారి మాత్రం నిర్మాతగానే ఈ సినిమా తీశా. స్టాండర్డ్స్‌లో తొలి సినిమాని మించి ఉంటుంది. వినోదం కూడా అదే స్థాయిలో పండించాం” అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే కథ ఇదని, అందరికీ కనెక్ట్ అవుతుందని దర్శకుడు తెలిపారు.