పెళ్లి సందD తో ఓ హిట్టు అందుకున్నాడు శ్రీకాంత్ తనయుడు రోషన్. నిజానికి ఈ సినిమాతో రోషన్ కంటే ఎక్కువ మైలేజీ శ్రీలీలకే వచ్చింది. తను వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. తన కాల్షీట్లు కూడా దొరకడం లేదు. అయితే.. ఇప్పుడు రోషన్ – శ్రీలీల కాంబోని మళ్లీ రిపీట్ చేయబోతున్నారు. రోషన్ హీరోగా.. వైజయంతీ మూవీస్ ఓ సినిమా ప్లాన్ చేస్తోంది. ఇందులో శ్రీలీలనే కథానాయికగా ఎంచుకున్నారు. పెళ్లి సందడి హిట్ అవ్వగానే.. అటు రోషన్కూ, ఇటు శ్రీలీలకూ ఫస్ట్ అడ్వాన్స్ చెక్ వైజయంతీ మూవీస్ నుంచే వచ్చింది. అందుకే ఇద్దరినీ మళ్లీ రిపీట్ చేయాలని ఫిక్సయ్యారు. ఓ కొత్త దర్శకుడు ఈ సినిమాతో వెండి తెరకు పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే కథ రెడీ అయిపోయింది. పెళ్లి సందడి 5 కోట్లలోపు పూర్తయిన సినిమా. కానీ వైజయంతీ మూవీస్ మాత్రం రోషన్ పై 20 కోట్లు పెట్టడానికి రెడీ అయ్యిందని టాక్. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి.