తెలుగు360 రేటింగ్: 1.5/5
తరం మారింది. అభిరుచులు మారాయి. ఆలోచన మారింది. దానికి తగ్గట్టుగానే సినిమా కూడా మారింది. దర్శకులు, రచయితలకు వయసుపైపడొచ్చు. వాళ్ల ఆలోచనలకు మాత్రం… కూడదు. అలా జరిగితే అవుడ్డేటెడ్ అయిపోయినట్టే.
అప్పట్లో పెళ్లి సందడి.. ఓ ట్రెండ్ సెట్టర్. పాటలు, సీన్లు, కామెడీ ఎవర్ గ్రీన్. జామ చెట్టుకింద రవళి మంచమేసుకుని పడుకుంటే… చిలక కొరికిన పండు బొడ్డుమీద పడడం లాంటి సీన్లు… అందులో రొమాన్స్… ఇహ చెప్పేదేముంది?
పాతికేళ్ల క్రితం చూశారుగా అని, ఇప్పుడూ అదే చూపిస్తే..? అది `పెళ్లి సందD` అవుతుంది.
ఈ పాతికేళ్లలో ప్రపంచమే మారింది. కానీ… రాఘవేంద్రరావు రాత తీత మారలేదు అని చెప్పడానికి ఇదే నిదర్శనం..
కథలోకి వెళ్దాం. వశిష్ట (రాఘవేంద్రరావు) బాస్కెట్ బాల్ మాజీ ఛాంపియన్. వయసైపోయి, రిటైరైపోయి, పిల్లలకు కోచింగ్ ఇస్తుంటాడు. తన కథ తెలుసుకుని, సినిమాగా తీయాలని ఓ వ్యక్తి (రాజేంద్రప్రసాద్) వస్తాడు. తనకి కథ వివరించే క్రమంలో సినిమా.. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. అక్కడ వశిష్ట (రోషన్)కి ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఆశ. ఓ పెళ్లిలో సహస్ర (శ్రీలీల)ని చూసి ఇష్టపడతాడు. తన అల్లరి, కొంటెతనం నచ్చుతాయి. సహస్రకి తన మనసులోని మాట చెప్పాలనుకుంటాడు. `విధి బలమైనదైతే.. అది మనల్ని కలుపుతుంది.. ఇప్పుడు నేను నీకు కనిపించకుండా పోతాను. మనం కలవాలని దేవుడు రాసి పెట్టుంటే మనం మళ్లీ కలుస్తాం` అని మాయమైపోతుంది. యాధృచ్ఛికంగా రైల్వే స్టేషన్ లో సహస్ర మళ్లీ కనిపిస్తుంది. కానీ అంతలోనే మాయం అవుతుంది. సహస్ర మాటిమాటికీ వశిష్టకి ఎందుకు దూరం అవుతోంది? సహస్ర మనసులో ఏముంది? వీళ్లిద్దరూ కలిశారా, లేదా? అనేది మిగిలిన కథ.
ఓ పెళ్లిలో ఓ అమ్మాయిని చూడడం, ప్రేమలో పడడం – ఆమె కోసం పాట్లు పడడం – ఇది పరమ పాత చింతకాయ పచ్చడి కథ. అలాగని – దాంతో మ్యాజిక్ చేయలేమా? అంటే `లేము` అని కాదు. చేయొచ్చు. పెళ్లిలో సరదాలు, పాటలు, అల్లర్లు, చక్కటి రొమాన్స్.. వీటితో సినిమాని నడిపించేయొచ్చు. పాత పెళ్లి సందడిలో ఇదే మ్యాజిక్ జరిగింది. అదే ఇక్కడా రీ క్రియేట్ చేయాలని భావించాడు రాఘవేంద్రరావు. కానీ.. అద్భుతాలు అన్నిసార్లూ జరగవు.. అనే విషయాన్ని గ్రహించలేకపోయాడు.
హీరోయిన్ ఇంట్రడక్షన్, ఆమె అందాల్ని చూపించే విధానం, బొడ్డుపై జామ కాయలు,గంగాళంలో కొబ్బరి బొండాలు పడితే నీళ్లు చిమ్మడం – ఇవన్నీ.. రాఘవేంద్రరావు తొలి సినిమా నుంచీ చూస్తూనే ఉన్నాం. ఇప్పుడూ అవే సీన్లు రిపీట్ చేసీ, చేసీ – తన పాత సినిమాలన్నీ ఒక్కసారి గా కళ్లముందుకు తీసుకొచ్చాడు దర్శకేంద్రుడు. ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్లకు – అప్పటి మ్యాజిక్ కనిపించదు. ఈ తరానికి.. మరీ ఇంత ఓవర్ మెలో డ్రామా ఏంట్రా బాబూ అనిపిస్తుంది. అలా.. రెండు వర్గాలకూ అందనంత దూరంలో ఒంటరిగా నిలబడిపోయాయి ఆయా సన్నివేశాలు. ఇక పెళ్లింట కామెడీ అయితే… మరీ రొటీన్ కి కేరాఫ్ అడ్రస్స్ గా అనిపిస్తాయి. శ్రీకాంత్ పెళ్లి సందడిలో సీన్లే… ఇప్పటికీ ఫ్రెష్ గా కనిపిస్తే… ఈనాటి పెళ్లి సందడి సీన్లు మాత్రం ముతక వాసన కొడతాయి. ముఖ్యంగా రఘుబాబు కామెడీ ట్రాక్ అయితే బీసీ కాలంనాటి ఎఫెక్ట్ తో సాగుతాయి.
నిజానికి ఈ కథంతా ఎప్పుడో ఎయిటీస్ లో సాగుతుందంటూ చూపించారు. కాకపోతే… హీరో, హీరోయిన్లు, చుట్టు పక్కల వాళ్లు మోడ్రన్ డ్రస్సుల్లో మెరిసిపోతుంటారు. ఒక్క సెల్‌ఫోన్ కనిపించదేమో? మిగిలినవన్నీ మామూలే. పుల్ల ఐసులూ,గోళీ సోడాలూ చూపించి.. ఇది ఎయిటీస్ కథ అనుకోమంటే ఎలా?
ఈకథలో బాస్కెట్ బాల్ లింకొకటి. ఆ స్పోర్ట్స్ కోటాకీ న్యాయం చేయలేదు. ఫస్టాఫ్ బొటాబొటీ మార్కులతో పాస్ అయితే అవ్వొచ్చు గాక… సెకండాఫ్ మాత్రం చీల్చి చెండాడేశారు. సీన్లు, డైలాగులు అన్నిటా – ఓల్డ్ మార్కే. రాఘవేంద్రరావు ఈ సినిమాని పెళ్లి సందడి కంటే ముందు తీసినా – అప్పటి జనాలకు కూడా ఎక్కేది కాదేమో…? పాటల్లో పాత రాఘవేంద్రరావు అక్కడక్కడ మెరిసినా – చాలా చోట్ల ఇంకా ఓల్డ్ స్కూల్ లోనే ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్ కి చేరే కొద్దీ.. ప్రేక్షకుల్లో అసహనం పెరిగిపోతుంది. పేలవమైన కథనం, ఏమాత్రం పట్టులేని ఎమోషన్లతో – గింగిరాలు తిప్పుతూ సినిమాని ఆపసోపాలు పడుతూ ముగించాడు.
రోషన్ చాలా అందంగా ఉన్నాడు. శ్రీకాంత్, ఊహల ఫీచర్స్ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. తన నటనలో ఈజ్ ఉంది. కానీ దాన్ని సరిగా వాడుకోలేదు. చాలా చోట్ల.. రోషన్ నటన ఆర్టిఫిషియల్ గా కనిపించింది. అదంతా దర్శకురాలు రోషన్ నుంచి నటన రాబట్టుకోవడంలో లోపంలానే అనిపిస్తుంది. శ్రీలీల అందంగా కనిపించింది. తన డాన్స్మూమెంట్స్ బాగున్నాయి. ప్రకాష్ రాజ్ సైతం.. ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లి నటించాడనిపించింది. రావు రమేష్‌కి అలవాటైపోయిన పాత్రే. వెన్నెల కిషోర్ కాస్త నవ్వించాడు.
కథ, కథనాల్లో ఏమాత్రం కొత్తదనం లేదు. పాటలు వినడానికి బాగున్నా – పిక్చరైజేషన్ తేడా కొట్టేసింది. కాస్ట్యూమ్స్ నుంచి రంగుల వరకూ అన్నిటా పాత వాసన కొట్టాయి. నేపథ్య సంగీతంలో అయితే కీరవాణి విసిగించాడు. శ్రీధర్ సిపాన డైలాగుల్లో ప్రాస ఎక్కువైంది. రాఘవేంద్రరావు ఈ సినిమాలో నటుడిగానూ కనిపించారు. ఆయన నటన చూస్తే.. ప్రెస్ మీట్లలో మాట్లాడినట్టు ఉంది తప్ప, నటించినట్టు అనిపించలేదు. రోషన్ ఎదిగి – రాఘవేంద్రరావులా మారడం – కాస్త జీర్ణించుకోలేని విధంగానే ఉంది. అసలు ఈ పాత్ర ఎందుకు చేశారో? అన్న అనుమానాలూ కలుగుతాయి.
కొన్ని టైటిళ్లు ముట్టుకోకూడదు. ఆ అద్భుతం సృష్టించిన కె.రాఘవేంద్రరావు లాంటి వాళ్లు ఆ ప్రయత్నం చేసినా – నెగ్గుకురావడం కష్టమని తేల్చిన సినిమా ఇది. పెళ్లి సందడిలో సందడంతా టైటిల్లోనే ఉంది. థియేటర్లో మాత్రం ఆహాకారాలు వినిపిస్తాయి.
తెలుగు360 రేటింగ్: 1.5/5