కొంతమంది దర్శకులకు తెరపై మెరవాలని ఉంటుంది. అందుకే చిన్న చిన్న పాత్రల్లో తళుక్కున మెరిసి వెళ్తుంటారు. వంద సినిమాలు చేసినా, ఒక్క సినిమాలోనూ, ఒక్క ఫ్రేమ్ లోనూ కనిపించలేదు రాఘవేంద్రరావు. ఇప్పుడెందుకో ఆయనకు కెమెరాముందుకు రావాలని పించింది. ఆయన్ని నటుడిగా అరంగేట్రం చేయించింది `పెళ్లి సందD`. శ్రీకాంత్ తనయుడు రోషన్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. శ్రీలీలా కథానాయిక. దసరాకి ఈ సినిమా విడుదల కానుంది. ఈరోజు ట్రైలర్ వచ్చేసింది.
ఈ చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. కానీ ఫ్రేములు చూస్తుంటే, అచ్చమైన దర్శకేంద్రుడి చిత్రంలా అనిపిస్తోంది. ఓ అబ్బాయి, ఓ అమ్మాయి.. వాళ్లిద్దరూ ఓ పెళ్లిలో కలుసుకోవడం, ప్రేమించుకోవడం, ఆ తరవాత విడిపోవడం – మధ్యలో ఫైట్లు, అందమైన పాటలు, రొమాంటిక్ సీన్లూ… వెరసి మొత్తంగా రాఘవేంద్రరావు సినిమానే చూస్తున్న ఫీలింగ్ తీసుకొచ్చింది. రోషన్ కి మాస్ ఇమేజ్ తీసుకురావాలన్న తాపత్రయమో ఏమో.. ఫైటింగులకు బాగానే స్కోప్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. రాఘవేంద్రుడ్నీ రెండు ఫ్రేముల్లో చూసే ఛాన్స్ వచ్చింది. ఆయన నుంచి డైలాగే వినిపించలేదు. కీరవాణి సంగీతం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ. అప్పట్లో సంచలనాలకు తెర లేపిన పెళ్లి సందడి – ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.