రామతీర్థంలో విజయసాయిరెడ్డి కారుపై చెప్పులు, రాళ్లు వేసిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. విజయసాయిరెడ్డి నేరుగా చంద్రబాబు, అచ్చెన్నాయుడు చేయించారని ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆయన చెప్పిందే వేదమన్నట్లుగా కేసులు నమోదు చేశారు. అలాగే మరికొంత మంది టీడీపీ నేతలపై కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ఇక్కడ కొన్ని మౌలిక మైన ప్రశ్నలు… పోలీసులు.. వైసీపీ ప్రభుత్వానికి సూటిగా ఎదురొస్తున్నాయి. గతంలో చంద్రబాబు అమరావతి పర్యటనకు వెళ్లినప్పుడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కొంత మంది చెప్పులు విసిరారు. రాళ్లు విసిరారు. బస్సు అద్దాలు కూడా ధ్వంసం అయ్యాయి.
ఆ తర్వాత విశాఖ పర్యటనకు వెళ్లినప్పుడు… పోలీసుల ఎదుటే.. ఆందోళనకారులు ఇంకా దారుణంగా వ్యవహరించారు. అయితే.. అప్పుడు డీజీపీ సవాంగ్.. అది భావ ప్రకటనా స్వేచ్చ అన్నట్లుగా చెప్పుకొచ్చారు. పెద్దగా కేసులు నమోదు చేయలేదు. కోర్టులు తలంటిన తర్వాత తూతూ మంత్రంగా.. కేసులు నమోదు చేశారు. ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. కానీ.. రామతీర్థం ఘటనలో…విజయసాయిరెడ్డి ఇలా ఫిర్యాదు చేయగానే.. అలా… ఏకంగా ప్రతిపక్ష నేతచంద్రబాబు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై కేసు నమోదు చేశారు. అప్పుడు చెప్పిన భావ ప్రకటన ఇప్పుడు ఎందుకు కాలేదన్నది చాలా మందికి అర్థం కాని విషయం. చట్టం అందరి విషయంలోనూ ఒకటే ఉండాలి. పోలీసులు ముఖ్యంగా… భద్రత విషయంలో… రాజీ పడకూడదు.
కానీ ప్రతిపక్ష నేతసెక్యూరిటీని పూర్తిగా రిస్క్‌లో పెట్టి .. వాటిని భావ ప్రకటనా స్వేచ్చగా చెప్పుకొచ్చి.. ఉద్రిక్తతలు తలెత్తుతాయని తెలిసి కూడా పోటీ యాత్రకొచ్చిన విజయసాయిరెడ్డి ఫిర్యాదును.. ఉన్నపళంగా తీసుకుని కేసులు నమోదు చేయడం.. పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరించలేదనడానికి పక్కా సాక్ష్యంగా నిలుస్తోంది. పోలీసులు చట్టం తప్పినప్పుడు.. వ్యవస్థ కూడా.. బలహీనపడుతుంది. ఏపీలో ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తోంది. అరాచకానికి సాక్ష్యంగా మారిపోయింది.