థ్రిల్లర్ చిత్రాల వల్ల రెండు లాభాలు.
ఒకటి.. పరిమితమైన బడ్జెట్ లో తీయొచ్చు.
ఈ సినిమాలకంటూ.. ప్రత్యేకమైన ఆడియన్స్ ఉన్నారు. కనీసం టార్గెట్ ఆడియన్స్‌కి రీచ్ అయితే చాలు. సినిమా గట్టెక్కేసినట్టే.
అయితే.. థ్రిల్లర్స్‌తో ఇబ్బందులూ ఉన్నాయి. కథ ఎలా ఉన్నా, కథనం రక్తి కట్టాలి. ట్విస్టులు ఇంట్రెస్టింగ్గా ఉండాలి. లేదంటే… మెప్పించడం కష్టం. థ్రిల్లర్స్ ఎంత బాగున్నా – వన్ టైమ్ వాచ్ అంతే. ఆ సస్పెన్స్ తెలిసిపోయాక, మళ్లీ మళ్లీ చూడడం చాలా కష్టం. కథలన్నీ ఒకే పాయింట్ చుట్టూ తిరుగుతాయి. ఆ పాయింట్‌పై ప్రేక్షకుడ్ని కూర్చోబెట్టడం అనుకున్నంత సులభం కాదు. అయినప్పటికీ థ్రిల్లర్స్ వస్తూనే ఉన్నాయి. ఆ జాబితాలో చేరే మరో సినిమా ‘పెంగ్విన్’.
లాక్ డౌన్ కాలం కదా? థియేటర్లు లేవు. వినోదం అంతా టీవీలు, లాప్ టాప్లకే పరిమితమైంది. ఓటీటీ వేదికలు ఇప్పుడు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి. థియేటర్ విడుదల కోసం ఎదురు చూడకుండా ఓటీటీలో తమ సినిమాని విడుదల చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు దర్శక నిర్మాతలు. ‘పెంగ్విన్’ కూడా.. అలా ఓటీటీలో ప్రత్యక్షమైనదే. కీర్తి సురేష్ లాంటి స్టార్ కథానాయిక, కార్తీక్ సుబ్బరాజు లాంటి సెన్స్‌బుల్ డైరెక్టర్ అండదండలు ఉండడం, ఓటీటీలో విడుదలైన తొలి పెద్ద సినిమా (తెలుగువరకూ) కావడంతో `పెంగ్విన్`పై ఆసక్తి రేగింది. మరి… అమేజాన్ ప్రైమ్ లో నేరుగా విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? ఎవరికి నచ్చుతుంది?
టీజర్, ట్రైలర్లలోనే కథ చెప్పే ప్రయత్నం చేశారు దర్శక నిర్మాతలు. అయినా.. కథలోకి వెళ్తే… రిథమ్ (కీర్తి సురేష్), రఘు (లింగ) భార్యాభర్తలు. ఓ హిల్ స్టేషన్లో సంతోషంగా కాపురం చేస్తుంటారు. వీళ్ల గారాల బిడ్డ…. గౌతమ్ (మాస్టర్ అద్వైత్). ఓసారి… అజయ్ కనిపించకుండా పోతాడు. తన కోసం భార్యభర్తలు, పోలీసులూ ఎంత గాలించినా దొరకడు. చార్లీ చాప్లిన్ ఆకారం ఉన్న వ్యక్తి… అజయ్‌ని ఎత్తుకుపోయినట్టు మాత్రం తెలుస్తుంది. రిథమ్ అజాగర్త వల్లే అజయ్ మాయమయ్యాడని భావించిన రఘు.. రిథమ్ నుంచి విడాకులు తీసుకుంటాడు. రిథమ్ మరో పెళ్లి చేసుకుంటుంది. గర్భవతి కూడా. అయినా సరే… అజయ్ గురించి అన్వేషిస్తూనే ఉంటుంది. ఈలోగా అజయ్‌లా చాలామంది పిల్లలు మాయమవుతారు. ఓరోజు సడన్‌గా అజయ్ దొరుకుతాడు. కానీ.. తన ప్రవర్తన వింతగా ఉంటుంది. నోటి నుంచి ఒక్క మాట కూడా రాదు. ఎవరికీ గుర్తు పట్టాడు. పిచ్చి పిచ్చి బొమ్మలేస్తుంటాడు. అజయ్ నోరు విప్పితే మిగిలినవాళ్ల ఆచూకీ తెలుసుకోవాలన్నది పోలీసుల ప్రయత్నం. అయితే అజయ్‌ని చార్లీ చాప్లిన్ ఆకారం వెంటాడుతూనే ఉంటుంది. మరి అజయ్ అలా మారడానికి కారణం? ఆ చార్లీచాప్లిన్ ముసుగులో ఉన్నది ఎవరు? ఈ విషయాలు తెలియాలంటే… `పెంగ్విన్` చూడాల్సిందే.
బిడ్డ కోసం ఓ తల్లిపడే ఆరాటం ఇది. కిడ్నాప్ డ్రామా, సైకో…. వీటి చుట్టూ తిరుగుతుంది. పాసింజర్ రైలును తలపిస్తూ… కథ మెల్లగా మొదలెట్టాడు దర్శకుడు. అజయ్ కనిపించకపోవడం, అతని గురించిన అన్వేషణతో సినిమా మొదలైంది. అప్పుడప్పుడూ చార్లీని చూపిస్తూ.. కథ ఉత్కంఠతని రేకెత్తించాడు. ఇంట్రవెల్‌కి ముందే అజయ్ దొరకడంతో.. అక్కడే కథ సమాప్తమైపోయినట్టు. కానీ అజయ్ వింత ప్రవర్తన, ఆ సైకో అన్వేషణ కథని ఇంకాస్త ముందుకు నడిపిస్తాయి. ఓ పాయింట్ దగ్గర సైకో దొరికేస్తాడు కూడా. కానీ ఆ తరవాత ఓ ట్విస్టు మిగుల్చుకుని మరో అరగంట కథని లాగాడు.
థ్రిల్లర్స్‌లో చిక్కుముడులు వేయడం కాదు, వాటిని విప్పడంలో అసలు మజా ఉంటుంది. సైకో ఎవరు? అనే ప్రయత్నంలో చేసే ఇన్వెస్టిగేషన్ కథకు ప్రాణం పోయాలి. కానీ `పెంగ్విన్`లో అది జరగలేదు. ఈ కథలో రెండు ట్విస్టులున్నాయి. సైకో దొరికేసిన విధానం ఏమంత ఆసక్తిగా అనిపించదు. ఓ కుక్క వల్ల.. హంతకుడు పట్టుబడడంలో కథానాయిక ఇంటిలిజెన్స్ ఏముంటుంది? డాగ్ స్వ్కాడ్ ఏదైనా ఆ పనే కదా చేస్తోంది. ఇక గౌతమ్ ని ఎవరు ఎత్తుకెళ్లారు? ఎందుకు ? అనే కారణాలు కూడా అంతగా అతకలేదు. ఇంతా చేసి `అసూయ` అనే పాయింట్ దగ్గరే ఆగిపోయాడు దర్శకుడు. ఆయా సన్నివేశాలు చూస్తే.. ఇటీవల విడుదలైన ‘హిట్’ సినిమా గుర్తొస్తుంది. ‘రాక్షసుడు’ సినిమాలోని సైకో సెటప్ ఈ సినిమాలో గమనించవచ్చు.
నిజానికి ముగింపు ఇంకా బాగా డిజైన్ చేసుకోవొచ్చు. సైకో థ్రిల్లర్స్ విజయాలన్నీ పతాక దృశ్యాలు, ఈ కథని ముగించిన విధానంపైనే ఆధారపడి ఉంటాయి. అవి రెండూ `పెంగ్విన్` విషయంలో దారుణంగా ఫెయిల్ అయ్యాయి. గౌతమ్ మిస్ అయినప్పుడు రిథమ్ తో పాటు ప్రేక్షకుడూ ఫీల్ అవ్వాలి. దొరికినప్పుడు రిథమ్ కంటే ప్రేక్షకుడే ఎక్కువ ఆనందించాలి. అది ఎమోషన్ థ్రెడ్ లాంటిది. ఆ సన్నివేశాల్ని ప్రభావవంతంగా చూపించలేదు దర్శకుడు. గౌతమ్ ని ఎవరు ఎత్తుకెళ్లారు? అనే విషయంలో సైకోనే కొన్ని క్లూలు ఇస్తాడు. అంత అవసరం.. ఆ సైకోకి ఏమొచ్చింది? సైకోల్లోనూ మంచితనం ఉంటుందని చూపించడానికి చేసిన ప్రయత్నం అనుకోవాలా?
కీర్తి సురేష్ మంచి నటి అన్న విషయం ఇది వరకే తెలిసిపోయింది. `పెంగ్విన్`లో ఆమె నటన అంతగా షాక్ ఇవ్వదు. కొత్తగానూ అనిపించదు. కాకపోతే.. బరువైన పాత్రని సైతం అవలీలగా పోషించేసింది. గౌతమ్ క్యూట్‌గా ఉన్నాడు. మిగిలిన నటీనటులంతా తెలుగు ప్రేక్షకులకు తెలిసిన మొహాలు కావు. సైకో.. పాత్రధారిగా అయినా నోటెడ్ నటుడ్ని తీసుకుంటే బాగుండేది. ఇది వరకు తెలుగులో చాలా సైకో సినిమాలొచ్చాయి. అయితే..వాటికంటే మించిన విషయమేదీ `పెంగ్విన్`లో కనిపించదు.
సాంకేతికంగా చూస్తే.. హిల్ స్టేషన్స్‌లో తీసిన సినిమా కాబట్టి, కొత్త కలర్ వచ్చింది. ఒకే ఒక్క పాట ఉంది. నేపథ్య సంగీతం థ్రిల్లర్ చిత్రాలకు తగినట్టే వుంది. కథ చిన్నది. కథనంలో గొప్ప మలుపులేమీ లేవు. ఉన్న మలుపులు సైతం… ఆకట్టుకునేలా తీర్చిదిద్దలేదు. మొత్తానికి `పెంగ్విన్` ఓ సాదా సీదా ప్రయత్నంగా మిగిలిపోతుందంతే. థియేటర్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు. టికెట్ డబ్బులు పెట్టాల్సిన పనిలేదు. ఖాళీగా ఇంట్లో కూర్చుని చూసే సినిమానే కదా.. అనుకుంటే మాత్రం అమేజాన్లోకి వెళ్లి, పెంగ్విన్ పై ఓ క్లిచ్ చేయొచ్చంతే.