తెలంగాణ సీఎం కేసీఆర్.. ఒక్కో ఉపఎన్నిక సమయంలో ఒక్కో హామీ నెరవేరుస్తున్నారు. తాజాగా.. గత ఎన్నికల్లో ఇచ్చిన 57 ఏళ్లకే సామాజిక పెన్షన్ హామీని వచ్చే నెల నుంచి అమలు చేస్తామని ప్రకటించారు. కుమారుడు కేటీఆర్ నియోజకవర్గం అయిన సిరిసిల్లలో కరెక్టరేట్ భవనాలు ప్రారంభించిన ఆయన .. కీలకమైన ప్రకటనలు చేశారు. అందులో హైలెట్ అయింది 57 ఏళ్లకే పించన్ అమలు. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన సమయంలో కేసీఆర్ చాలా హామీలు ఇచ్చారు. రైతు బంధును ఎకరానికి ఎనిమిది వేల నుంచి పదివేలకు పెంచడం, రుణమాఫీ, పెన్షన్ల వయసు తగ్గింపు, నిరుద్యోగ భృతి ఇలాంటి కీలకమైన హామీలు ఉన్నాయి.
అయితే రెండో సారి గెలిచిన తర్వాత ఏ పథకమూ పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయారు. రైతు బంధును పూర్తి స్థాయిలో అమలు చేయడానికే తంటాలు పడుతున్నారు. మధ్యలో ఓ సారి రుణమాఫీ అమలుచేస్తున్నట్లుగా ప్రకటించారు. కానీ ఆ ప్రకటన ఎక్కడిదక్కడే ఉండిపోయింది. అసలే నిధుల కష్టాలకు తోడు.. కరోనా వచ్చి పడింది.దీంతో అన్నీ వెనక్కి పోయాయి. దుబ్బాక. ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లాంటివి వచ్చినప్పుడు.. ఈ పథకాలను అమలు చేయబోతున్నాం.. అనే ప్రకటనలు ప్రభుత్వం వైపు నుంచి వస్తూంటాయి. కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత అంతా సైలెంటయిపోతారు.
నిజానికి కేసీఆర్ 57 ఏళ్ల కే పెన్షన్ ఇస్తామన్న హామీని మ్యానిఫెస్టోలో పెట్టారని చాలా మందికి గుర్తు లేదు. విపక్షాలు కూడా ఈ అంశంపై ప్రభుత్వాన్ని పెద్దగా ప్రశ్నించిన దాఖలాలు లేవు. కానీ హఠాత్తుగా సీఎంకేసీఆర్ … సిరిసిల్ల పర్యటనలో ఈ వరం ప్రకటించారు. హుజూరాబాద్ ఉపఎన్నిక ముందు.. ఇలా కేసీఆర్ చెప్పడం కామనేనని..కానీ ఎప్పటికీఅమలు చేయరని.. విపక్షాలు సహజంగానే విమర్శలు గుప్పిస్తూ ఉంటాయి.