రాజకీయ పార్టీలు ప్రజలను ఆకర్షించేందుకు వాగ్దానాలు చేయడంలో తప్పు లేదు. ప్రజాకర్షక విధానాలు అని జయప్రకాశ్ నారాయణ వంటి వారు తీసిపారేస్తారు గాని నేనైతే ఏదో రూపంలో ప్రజలకు చేరితే మంచిదే కదా అని వాదించేవాణ్ని. అయితే ఇటీవల మరీ మంగళసూత్రాలు, ఉచిత చీరలు, అంటూ వ్యక్తిగత పంపిణీ కింద ప్రభుత్వ ధనంతో రాజకీయ ప్రచారంలా పరిణమించడం ఆలోచించాల్సిందిగానే మారింది. ఇంకా అధికారంలోకి రాని ప్రతిపక్ష వైఎస్ఆర్సిపి నేత జగన్ నవ రత్నాల పేరిట కొత్త వరాలు ప్రకటించారు బాగానే వుంది. అయితే ఈ వూపులోనే 45 ఏళ్లు నిండిన దళితులకు పెన్షన్ ఇస్తానని అనంతపురంలో అన్నారట. దళితులు లేదా శ్రమజీవులు చాలామంది చిన్న వయస్సులోనే శ్రమతో పేదరికంతో పెద్దవాళ్లలా కనిపించే మాట నిజమే. వారికి త్వరగా సహాయం అందించడం కూడా తప్పు కాదు. అయితే దాన్ని కూడా పెన్షన్ అనేట్టయితే ఆ మాటకు వున్న అర్థమే తారుమారై పోతుంది. వృద్ధాప్యంతో ముడిపడిన దాన్ని నడివయసు తొలిదశకే వర్తింపచేయడం తర్కబద్దం కూడా కాదు. వీలైనన్ని రోజులు ఉత్సాహంగా వుంచి ఉపకారం చేయొచ్చు గాని పెన్షన్ వయస్సును తగ్గించనవసరం లేదు. 45 ఏళ్లకే పదవీవిరమణ అశక్తత లాటి భావాలు కలిగించడం సమాజానికి కుటుంబాలకు మేలు చేయదు. సో.. సలహాదారు ప్రశాంత్ కిశోర్ దీనికి ఏదైనా ప్రత్యామ్నాయ పేరు సూచించి అకాల వృద్థాప్యాన్ని ఆపాలని కోరుకుందాం..