చంద్రబాబు నాయుడు తొలి నెలలోనే తన మార్క్ గవర్నెన్స్ చూపించేందుకు ప్రయత్నించారు. ఉద్యోగులకు జీతాలు ఎప్పుడొస్తాయో గత ఐదేళ్ల కాలంలో ఎవరికీ తెలియదు.కానీ ఈ సారి మాత్రం ప్రాధాన్యతగా తీసుకుని చంద్రబాబు అందరికీ పెన్షన్లు, జీతాలు జమ చేశారు. అన్ని శాఖల ఉద్యోగులకూ జీతాలు జమ అయ్యాయి. గతంలో ప్రయారిటీల వారీగా శాఖలకు జీతాలు జమ చేసేవారు. ఇప్పుడు అందరికీ ఇచ్చేశారు.
జీతాలు, పెన్షన్లకు మొత్తం పది వేల కోట్లకుపైగా అవసరం. పైగా జగన్ హయాంలో చేసిన అప్పులకు వాయిదాలను ఆర్బీఐ రాష్ట్ర ఆదాయం నుంచి మనహాయించుకుంటుంది. అయినా ముందుగా అనుకున్న విధంగా జీతాలు, పెన్షన్లు చెల్లించకపోతే.. నమ్మకం పోతుందని.. కష్టమైనా సరే.. ముందు అందర్నీ సంతృప్తి పరిచే ప్రయత్నం చేశారు. అయితే ముందు ముదు ప్రభుత్వం అసలు సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది.
ఇంత కాలం ఆగిపోయిన ఆర్థిక కార్యకలాపాలు ఏపీలో పెరుగుతున్నాయి. దీంతో ఆదాయం కూడా క్రమంగా పెరిగే అవకాశం ఉంది. గతంలో ప్రభుత్వ ఆదాయాన్ని ప్రైవేటు వ్యక్తులు దోపిడీ చేసేవారు. ఇప్పుడా చాన్స్ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆదాయం అనూహ్యంగా పెరగబోతోందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.