మీ ఇంటి వద్దకే మీ పెన్షన్ అంటూ.. ఏపీ ముఖ్యమంత్రి చేసిన వినూత్న ఆలోచన బంపర్ సక్సెస్ అయింది. ఇప్పటి వరకూ ఒకటి నుంచి పదో తేదీ వరకూ.. ఎప్పుడు పెన్షన్ ఇస్తారో తెలియని పరిస్థితి ఉండేది. వాలంటీర్ల వ్యవస్థ వచ్చిన తర్వాత కూడా.. అలాగే ఉంది. అయితే.. ఈ మార్చి నుంచి మాత్రం.. ముఖ్యమంత్రి సమూలంగా పరిస్థితిని మార్చేశారు. ఈ నెల నుంచి ప్రతి నెల ఒకటో తేదీన.. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటలోపు పెన్షన్ల పంపిణీని పూర్తి చేయాలని ఆదేశించారు. దానికి తగ్గట్లుగా వాలంటీర్ల వ్యవస్థను.. పక్కాగా ఉపయోగించడంలో యంత్రాంగం సక్సెస్ అయింది. ఈ రోజు.. సామాజిక పెన్షన్ల పంపిణీ పూర్తయిపోయింది.
తెల్లవారక ముందు వాలంటీర్లు.. మరుమూల ప్రాంతాలకు కూడా వెళ్లిపోయారు. ఆదివారమైనా లబ్ధిదారులకు నగదు అందించారు. 58,44,642 పెన్షన్లలో మధ్యాహ్నం 1 గంటలకు 45.24 లక్షలు పంపిణీ చేశారు. అర్హులైన అందనివారికి, వెరిఫికేషన్ పూర్తైన వారికి ఒకేసారి రూ.4,500 అందించారు. పెన్షన్ల పంపిణీపై రియల్ టైం డేటాను రూపొందించారు. జిల్లాల్లో ప్రత్యేక సెల్ల ఏర్పాటు, నిరంతర పర్యవేక్షణ తొలినెలలో ఎదురైన సమస్యలకు ప్రభుత్వం చెక్ పెట్టింది. ఎక్కువగా పెన్షన్లు తీసుకునేవారు వృద్ధులే ఉంటారు కాబట్టి.. వారందరికి సంతృప్తి కర స్థాయిలో సేవలు అందించడానికి ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు.
ప్రభుత్వ పథకాలన్నీ డోర్ డెలివరీ చేయడం ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం. ఆ ఉద్దేశంతోనే.. యాభై ఇళ్లకో వాలంటీర్ను పెట్టారు. రేషన్ బియ్యాన్ని కూడా ఇంటికే సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేస్తున్నారు. త్వరలో రాష్ట్రం మొత్తం ఈ విధానాన్ని అమలు చేయబోతున్నారు. మొత్తానికి వాలంటీర్ల వ్యవస్థను.. పకడ్బందీగా వాడుకుని.. ప్రజలకు నేరుగా.. పథకాలు అందించే క్రమంలో.. ప్రభుత్వం సఫలమవుతున్నట్లుగానే కనిపిస్తోంది.