గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లలో భాజాపా గెలిచింది. గుజరాత్ లో కాస్త టఫ్ ఫైట్ ఉంటుందని, హిమాచల్ సునాయాసంగా కమల వశం అ వుతుందని ముందు ఊహించినట్టే ఫలితాలు వచ్చాయి. ఇంకేం… ప్రధాని మోడీ విజయోత్సాహంతో ఉన్నారు. ప్రజలు భాజాపా పట్ల పూర్తి విశ్వాసం కనపరచారంటూ ఆనందం వ్యక్తం చేశారు. గుజరాత్ అభివృద్ధిని అడ్డుకోవాలనుకున్న కాంగ్రెస్ కుయుక్తులను ప్రజలు తిప్పికొట్టారన్నారు.
సరే.. అంతవరకూ బానే ఉంది. ఆయన జీఎస్టీ, నోట్ల రద్దుపై ప్రజలు తమకు వ్యతిరేకంగా ఓటేస్తారని కాంగ్రెస్ ఊహించిందన్నారు. అయితే అలా జరగలేదని, సంస్కరణల పట్ల ప్రజలు మొగ్గు చూపారని వ్యాఖ్యానించారు. అయితే ప్రధాని మోడీ తెలివిగా మాట్లాడుతున్నా… తెలిసిపోతున్న విషయం ఏమిటంటే… ఈ గెలుపును ఆయన తన నిర్ణయాల పట్ల వ్యక్తమైన ప్రజా మద్ధతుగా చిత్రీకరించాలని చూస్తున్నారనే విషయం. నిజానికి గుజరాత్ ఎన్నికల్లో ప్రధాని ఎంచుకున్న ప్రచారశైలి చూసిన వారెవ్వరూ ఈ మాటతో ఏకీభవించరు. ఆయన గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డడం మాత్రమే కాదు… రకరకాల ఆరోపణలు చేశారు. ఇందులో చాలా వరకూ ఆయన స్థాయికి తగినట్టు లేవని సాక్షాత్తూ ఆయన మిత్ర పక్షం శివసేన సైతం వ్యాఖ్యానించడం చూశాం. తనను చంపేందుకు కాంగ్రెస్ నేతలు సుపారీ ఇచ్చారంటూ విపరీతమైన ఆరోపణలకు కూడా
ఆయన వెనుకాడలేదు.
గుజరాత్ ఎన్నికల్లో గెలుపు కీలకం కాబట్టి ఆయన అలా మాట్లాడారంటూ భాజాపా శ్రేణులు సమర్ధించుకోవచ్చు. అది వేరే విషయం. అయితే ఆ ఎన్నికల్లో నోట్ల రద్దు, జిఎస్టీ గురించి ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు. వాటి అమలును, ఫలితాలను చూపించి ఓట్లు అభ్యర్ధించలేదు. అలాగే ఆయన చేపట్టిన ఇతరత్రా ఆర్ధికపరమైన సంస్కరణలు దేని గురించి పెద్దగా మాట్లాడలేదు. మరి అలాంటప్పుడు ఈ ఎన్నికల ఫలితాలను సంస్కరణలకు ప్రజల తరపున లభించిన అంగీకారంగా ఆయన ఎలా పేర్కొంటున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం కూడా ఆయన ప్రస్తుత ప్రకటనల్లోనే ఉంది. సంస్కరణల అమలు కాలంలో కొన్ని కఠిన పరీక్షలు తప్పవని అభివృద్ధి కోసం మరిన్ని సంస్కరణల దారి పడతాం అని ఆయన అంటున్నారు. అంటే… ఉందిలే గడ్డు కాలం ముందు ముందునా… అందరూ సిద్ధపడాలి దేశమందునా… అని చెప్పకనే చెబుతున్నారు.