ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేడని సామెత! కానీ ఇవాళ్టి రోజుల్లో అంతా ట్రెండ్ మారిపోయింది. ఇంటిదొంగలు కూడా బహిరంగంగానే తమ వ్యవహారాలను చక్కబెట్టేసుకుంటున్నారు. చూడబోతే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా దక్కకుండా పోయేలా.. మన రాష్ట్రానికి చెందిన కొందరు పెద్దలే కుట్ర చేసేలాగా, ప్రజల బుర్రలను ట్యూన్ చేసేలాగా కనిపిస్తున్నది. ఆ విషయంలో ఏపీ ఎన్జీవోల సంఘం నాయకుడు అశోక్బాబు కూడా తన వంతు పాత్ర పోషిస్తున్నట్లు ఆయన తాజా మాటలను బట్టి అనుమానాలు కలుగుతున్నాయి.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించే విషయంలో ప్రభుత్వం అచేతనంగా ఉన్నదనే ఆరోపణలు మిన్నంటుతున్నాయి. కేంద్రంతో సామరస్యంగా ఉండి పనులు సాధించుకోవడం అనే ముసుగులో ఇప్పటికే రాష్ట్రానికి చాలా నష్టం జరిగిపోతున్నదని ప్రజలు భావిస్తున్నారు. ప్రజలను నెమ్మదిగా ప్రత్యేకహోదా లేకపోయినా సర్దుకుందాం అనేలా ట్యూన్ చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఒకవైపు హోదా గురించి జనాగ్రహం పెల్లుబుకుతున్నది.
ఇలాంటి నేపథ్యంలో రాష్ట్రస్థాయి ప్రయోజనాలు సాధించాలంటే కీలకంగా ఉద్యమాలలో పాల్గొనే ఉద్యోగ వర్గాలకు సంబంధించి అశోక్బాబు కూడా చంద్రబాబు పాటకు వంత పాడే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కంటె , పోలవరం ప్రాజెక్టు వస్తే చాలునని, హోదాతో అయిదేళ్లు మాత్రమే లాభం అని పోలవరం పూర్తయితే శాశ్వత ప్రయోజనాలు అని ఆయన సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
గతంలో సమైక్యాంధ్రకోసం ఉద్యమాలు జరిగినప్పుడు కూడా ఏపీ ఎన్జీవోలు చాలా కీలకంగా ఉద్యమంలో పాల్గొన్నారు. ఇప్పుడు హోదా కోసం జనంలో చైతన్యం పెరిగితే.. మళ్లీ ఎన్జీవోలు తప్పకుండా ఉద్యమం ఆరంభించే అవకాశం ఉంటుంది. అయితే ఎన్జీవోల నాయకుడిగా అశోక్బాబు.. ముందునుంచే తమ ఉద్యోగ వర్గాలను దువ్వుతున్నట్లుగా.. హోదాను మంటగలిపేయడానికి సిద్ధమవుతున్నట్లుగా అనుమానం కలుగుతున్నది. అదే నిజమైతే గనుక.. ఇలాంటి డొంకతిరుగుడు తప్పిదాలను ప్రజలు గుర్తిస్తే ఎన్నటికీ క్షమించరని నేతలు తెలుసుకోవాలి.