హైదరాబాద్: ఐదురోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరానికి నీటి కొరత తీరటం, భూగర్భజల మట్టాలు పెరగటం బాగానేఉందిగానీ, చెట్లు కూలటం, లోతట్టు ప్రాంతాలు జలమయమవటం, ట్రాఫిక్ కష్టాలతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చోలీచౌకీ, బేగంపేట, అమీర్ పేట వంటి పలుప్రాంతాలలో రోడ్లు చెరువులుగా మారాయి. కొన్నిచోట్ల టూవీలర్స్, మరికొన్నిచోట్ల కార్లుకూడా కొట్టుకుపోయాయంటే రోడ్లపై ఎంత నీరు ప్రవహించిందో అర్థం చేసుకోవాచ్చు. దీనికితోడు భారీవర్షాలతో చెత్త, ప్లాస్టిక్ కవర్లు, భవన శిధిలాలు వచ్చి చేరటంతో అనేకచోట్ల డ్రైనేజ్ బ్లాక్ అయిపోయిందని జీహెచ్ఎమ్సీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు, కేబుల్ ప్రసారాలకు అంతరాయం సమస్యలు ఏర్పడ్డాయి. ఇక ట్రాఫిక్ సంగతి చెప్పనలవికాకుండా ఉంది. రోడ్లు, నాలాలు వరదనీటితో పొంగి పొర్లుతుండటంతో అమీర్పేట, సికింద్రాబాద్, పార్శిగుట్ట, ఖైరతాబాద్, సోమాజిగూడ, బంజారాహిల్స్, నారాయణగూడ, మెహదీపట్నం, మాసాబ్ ట్యాంక్, రేతిబౌలి, లంగర్ హౌస్ ప్రాంతాలలో ట్రాఫిక్ పలుసార్లు స్తంబించిపయింది. గంటల తరబడి వాహనదారులు, ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారులపై గుంటలతో ప్రయాణం చుక్కలు చూపిస్తోంది.