కొంతకాలంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ పై ప్రజలంతా అసహనంగా ఉన్నారు. ముఖ్యంగా చిన్న వర్షం పడితే చాలు… హైదరాబాద్ అంతా జామ్ అయిపోతుంది. రోడ్లపై ట్రాఫిక్ పోలీసులు కనపడరు. క్లియర్ చేయాలన్న పట్టుదల కనిపించట్లేదు. ఫలితంగా 30 నిమిషాల ప్రయాణానికి 2గంటలకు పైగా టైం పడుతోంది.
సోమవారం సాయంత్రం అయితే హైదరాబాద్ వాసుల కష్టం అంతా ఇంతా కాదు. బెంగళూరు ట్రాఫిక్ జాంపై వినడం తప్పా చూడని వారు సైతం వామ్మో ఇంత ఘోరంగా ఉంటుందా అన్నట్లు ఇబ్బంది పడ్డారు.
నగరంలో ఏ మూల చూసినా మొత్తం జామ్. మధ్యాహ్నం తర్వాత కురిసన వర్షానికి తోడు, రాఖీ పండుగ కావటం, వరుసగా వచ్చిన నాలుగైదు రోజుల సెలవుల చివరి రోజు కావటంతో రోడ్లపైకి భారీగా వాహనాలు వచ్చాయి. ప్రజలంతా ఒక్కసారిగా రోడ్లపైకి రావటం, వర్షపు నీరు నిలిచిపోవటంతో ట్రాఫిక్ ఎక్కువైంది. దీన్ని క్లియర్ చేయాల్సిన పోలీసులు రోడ్లపై పెద్దగా కనపడలేదు. అడిగే వాడు లేకపోతే, కంట్రోల్ చేసే వ్యవస్థ లేకపోతే ట్రాఫిక్ ఎంత అస్తవ్యస్థం అవుతుందో సోమవారం సాయంత్రం ఘటనలే ఉదాహరణ.
గతంలోనూ సీఎం రివ్యూ సందర్భంగా చాలా క్లియర్ గా ఆదేశాలిచ్చారు. ట్రాఫిక్ సిగ్నల్స్, ముఖ్యమైన కూడలి వద్ద పోలీసులు ఉండాల్సిందే… ఈ మధ్య ట్రాఫిక్ పోలీసులు చలానాలు వసూలు చేసేందుకు తప్పా ఎక్కడా కనపడటం లేదన్న ఫిర్యాదు అందుతున్నాయని, అధికారులు ట్రాఫిక్ జాం నివారణకు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని సీఎం ఆదేశించారు.
కానీ, అవేవి అధికారులకు పట్టలేదా… సెలవుల కారణంగా పోలీసులు కూడా అందుబాటులో లేరా… ఏదైనా కానీ, హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ నరకం మరోసారి ఎదురైంది. ఈసారి హైదరాబాద్ మహానగరం మొత్తం జామ్ కావటం నిర్లక్ష్యం కారణంగానే అన్న విమర్శలు మాత్రం ఎదురవతుతున్నాయి.