సీఎం జగన్ కుప్పం వెళ్తున్నారు. ఆర్టీసీ బస్సులు.. స్కూల్, కాలేజీ బస్సులను జిల్లా మొత్తం నుంచి స్వాధీనం చేసుకుని జన సమీకరణ చేస్తున్నారు. ప్రతీ గ్రామానికి బస్సు పంపుతున్నారు. అయితే కుప్పంలో కాదు ఇతర నియోజకవర్గాల నుంచి. కుప్పంను మాత్రం పూర్తిగా అష్టదిగ్బంధం చేశారు. సీఎం జగన్ హెలికాఫ్టర్లో అడుగు పెట్టినప్పటి నుండి మళ్లీ హెలికాఫ్టర్ ఎక్కే వరకూ బారీకేడ్లు రెండు వైపులా ఉంటాయి. కుప్పం పట్టణం వ్యాపార సంస్థల్ని జగన్ పర్యటన ముగిసేవరకూ మూసేయాలని ఇప్పటికే ఆదేశించారు.
మరో వైపు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు అనుకున్న వారి ఇంటి ముందు పోలీసుల్ని కాపలా పెట్టారు. చాలా మందిని హౌస్ అరెస్ట్ చేశారు. చంద్రబాబు పర్యటన సమయంలో గొడవలు జరిగినప్పుడు దెబ్బలు తిన్న టీడీపీ నేతలపైనే కేసులు పెట్టారు. ఆ కేసుల్లో ఇప్పటికీ కొంత మంది జైల్లోనే ఉన్నారు.. ఇలా టీడీపీపై పూర్తి స్థాయి ఆంక్షలు పెట్టి.. కుప్పం ప్రజల్ని కూడా బహిరంగసభకు రానీయకుండా అడ్డుకుని.. జగన్ పర్యటిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి కుప్పానికి బస్సుల్లో జన సమీకరణ చేసి.. కుప్పం లో వెల్లువెత్తిన జనం అని ప్రచారం చేసుకోవడానికి తాపత్రయ పడుతున్నారు.
కుప్పంలో గెలవాలనుకుంటే.. ఇంత భయపడితే ఎలా అన్న ప్రశ్న టీడీపీ వర్గాల నుంచి వస్తోంది. కుప్పం ప్రజలను ఇంత నిర్బంధాలకు గురి చేసి అక్కడ పర్యటించాల్సిన అవసరం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే జగన్ ఎక్కడికెళ్లినా బారీకేడ్లు పెట్టడం కామన్ అని చెబుతున్నారు. కుప్పంలో జగన్ పర్యటన అక్కడి ప్రజలను మాత్రం నోరు నొక్కుకునేలా చేస్తోంది. ఇంత అభద్రత ఉన్న వారు గెలుస్తామని ఎలా చెబుతున్నారనేదే వారి ఆశ్చర్యానికి కారణం.