కల్తీ అయిన నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపారని.. లడ్డూలు కల్తీ కాలేదని వైసీపీ నేతలు బలంగా వాదిస్తున్నారు. ఒకటికి నలుగురితో సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయించారు. అక్కడ తమ వాదనను బలంగా వినిపించగలిగారు. తదుపరి విచారణ గురువారం జరుగుతుంది. కానీ ప్రజల్లో ఎన్నో సందేహాలు ఉన్నాయి.
అప్పటి వరకూ వాడిన నెయ్యి సంగతేంటి ?
ఏఆర్ డెయిరీ నుంచి వచ్చిన నెయ్యిని యథేచ్చగా వాడేస్తున్న సమయంలో ఈవోగా వచ్చిన శ్యామలరావు నెయ్యికి..నూనెకు తేడా లేకపోవడం గుర్తించి.. పరీక్షలకు పంపించారు. నాలుగు ట్యాంకర్లలో జంతువుల కొవ్వు వ్యర్థాలు ఉన్నట్లుగా తేలింది. మరి వాడిన ట్యాంకర్లలో ఏముంది ?. ఆ నెయ్యితో చేసిన లడ్డూలు భక్తులు తీసుకెళ్లిపోయారు. ఇక అవి దొరకవు కాబట్టి సాక్ష్యాలేవి అని వాదించడం ప్రారంభించారు. నెయ్యిలోనే కల్తీ ఉందని లడ్డూలో లేదని వాదిస్తే ఇక సాక్ష్యాలు లేనట్లే అని చంకలు గుద్దుకుంటున్నారు. కానీ దొరికిన వాళ్లే దొంగలు.. అంతే కానీ అప్పటి వరకూ వారు దొంగతనం చేసినదంతా కరెక్టే అనుకుంటే అది న్యాయం ఎలా అవుతుంది ? చేసిన తప్పు మాఫీ అయిపోతుందా ?
లడ్డూ క్వాలిటీ భక్తులకు తెలియదా ?
తిరమల ప్రసాదం రుచి జగన్ రెడ్డికి తెలియకపోవచ్చు. ఆయన పూర్వీకులు మతం మారిపోయారు. వారు ప్రసాదం తినరు. కానీ కోట్లాది మంది హిందువులకు ప్రతి ఏడాది ఒక్కసారి అయిన శ్రీవారి ప్రసాదాన్ని కళ్లకు అద్దుకుని నోట్లో వేసుకుంటేనే మనశ్మాంతిగా ఉంటుంది. ఆ రుచి వారికి తెలియదా ?. తిరుమల శ్రీవారి ప్రసాదం నెల రోజుల పాటు బయట ఉన్నా పాడైపోదు. కానీ గత ఐదేళ్లలో శ్రీవారి ప్రసాదం.. దేవుడి దగ్గర పెట్టినా సరే నాలుగైదు రోజులకే పాడైపోతుందని వాసన వస్తుందని వందలాది మంది భక్తులు చెబుతున్నారు. ఈ నిజం చెప్పే సాక్ష్యం ఏమిటి ?. లడ్డూ క్వాలిటీ పూర్తిగా పడిపోయిందని వంద శాతం భక్తులు అంగీకరించిన అంశానికి ఏ విలువా ఉండదా ?
తప్పు బయటపెట్టడం మనోభావాలు దెబ్బతీయడం కాదు !
ఓ ఘోరమైన అపచారం జరిగింది. దాన్ని అలా తొక్కి పెట్టి ఉంచితే ఏమవుతుంది ?. ఎప్పుడో ఓ సారి బ్లాస్టవుతుంది. దాన్ని తొక్కి పెట్టిన వారే సమస్యలు ఎదుర్కొంటారు . ఇది అందరికీ తెలిసినా బయట పెడితే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని అలా దాచి పెట్టేస్తారని దొంగలు అనుకున్నారు. భక్తుల విశ్వాసాలతో ఆడుకున్నారు. ఇలాంటి తప్పును బయట పెట్టడం .. కోటాను కోట్ల భక్తుల విశ్వాసాలను దెబ్బతీయడం కాదు.. అలా దెబ్బతీసిన వారిని భక్తుల ముందు దోషులుగా నిలబెట్టడం. ఇప్పుడు అదే జరిగింది. కానీ అలా బయట పెట్టడమే తప్పని .. కోర్టుల్లోనూ వాదిస్తున్నారంటే ఏం చేయాలి ?
సిట్ విచారణకు భయం ఎందుకు ?
ప్రభుత్వం నియమించిన సిట్ కాబట్టి చంద్రబాబు చెప్పినట్లే చేస్తుందట. మరి జగన్ హయాంలో నమోదు చేసిన కేసులన్నీ ఆ బాపతే అన్నట్లేగా. ఒక్క సాక్ష్యం లేకపోయినా కొన్ని వందల కేసులు పెట్టి ఊరూవాడా ఎందుకు ప్రచారం చేశారు. అయినా రాష్ట్ర దర్యాప్తు సంస్థల నిజాయితీని ఒక్క కోర్టు కూడా ప్రశ్నించలేదు కదా. ఇప్పుడు సిట్ కూడా లడ్డూ కల్తీ వ్యవహారాన్ని ప్రజల ముందు ఆధారాలతోనే పెడుతుంది. లేకపోతే ప్రజలు కూడా నమ్మరు. అప్పుడు సిట్ ను ప్రశ్నించవచ్చు. ముందే సిట్ ను ఎందుకు వద్దంటున్నారు ?. లేదు సీబీఐ కూడా కల్తీ జరిగిందంటే.. వివేకా కేసులో తప్పుడు ఆరోపణలు చేసినట్లుగా చేయరని గ్యారంటీ ఏంటి ? సీబీఐని చంద్రబాబు మ్యానేజ్ చేశారని అనరని గ్యారంటీ ఏమిటి ? కోర్టు పర్యవేక్షణలో జరిగినా ఇదే రిజల్ట్ వస్తే.. వ్యవస్థల్ని బాబు మేనేజ్ చేశాడని అనడం వారికి చాలా సులువే కదా ?
న్యాయవ్యవస్థతో తాము అధికారంలో ఉన్నంత కాలం ఓ ఆట ఆడుకున్నారు గత పాలకులు ఇప్పుడూ అదే ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. కానీ దేవుడితో పోరాడుతున్నామన్న సంగతిని వారు మర్చిపోతున్నారు.