అతి తక్కువ సమయంలో వంద సినిమాలు పూర్తి చేయాలన్న లక్ష్యంతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రయాణం ప్రారంభమైంది. సినిమాలైతే వేగంగా తీస్తున్నారు. కానీ ఆ స్థాయిలో ఫలితాలు మాత్రం కనిపించడం లేదు. పెద్ద హీరోలతో సినిమాలు చేస్తున్నారు కానీ, ఆశించిన విజయాలు అందుకోవడం లేదు. అయితే ఇప్పటికీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ జోరు తగ్గడం లేదు. ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు తీస్తూనే ఉన్నారు. చిన్నా, పెద్ద, మీడియం ఇలా కనీసం ఈ ఫ్యాక్టరీలో ఇప్పుడు 20 సినిమాలైనా సెట్స్‌పై ఉన్నాయి. మరో పది సినిమాలకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. 2025 ఈ సంస్థకు చాలా కీలకం. ఎందుకంటే ఈ యేడాది కనీసం 5 సినిమాలు విడుదల చేయాలన్న ప్రణాళికల్లో వుంది పీపుల్ మీడియా. ఇందులో అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ ‘రాజాసాబ్’ కూడా వుంది.
ప్రభాస్ – మారుతి కాంబోలో రూపొందిన రాజాసాబ్ ఈ వేసవి సీజన్లో విడుదల కాబోతోంది. దాంతో పాటు సిద్దు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’, తేజా సజ్జా ‘మిరాయ్’, అడవిశేష్ ‘గూఢచారి 2’ ఇవి కూడా ఈ యేడాదే రాబోతున్నాయి. వీటన్నింటిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల పట్టాలెక్కిన ‘గరివిడి లక్ష్మి’ సినిమానీ 2025లోనే విడుదల చేస్తారు. ఈ ఐదు ప్రాజెక్టులపై పీపుల్ మీడియా ప్రత్యేకమైన ఫోకస్ చేసింది. గతంలో చేసిన తప్పుల్ని పునరావృతం కాకుండా, కథల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని, దుబారా ఖర్చు తగ్గించాలని పీపుల్ మీడియా భావిస్తోంది. అందుకు తగ్గట్టుగానే టీమ్ లో కొన్ని మార్పులూ చేర్పులూ జరిగాయి. `రాజాసాబ్` హిట్టయితే పీపుల్ మీడియాకు సగం కష్టాలు తీరిపోతాయి. 2025లో కనీసం రెండు హిట్లు పడినా – వంద సినిమాల మైలు రాయి ముందు కొత్త ఉత్సాహం వస్తుంది. చిత్రసీమకు విజయాలు చాలా అవసరం. ఓ సినిమా హిట్టయితే.. ఆ స్ఫూర్తితో కనీసం పాతిక సినిమాలు సెట్స్‌పైకి వెళ్తాయి. కొత్త నిర్మాతలు ధైర్యంగా అడుగులేస్తారు. పీపుల్ మీడియా లాంటి పెద్ద సంస్థలు చిత్రసీమని ప్రభావితం చేయగలవు. అలాంటి సంస్థలకు విజయాలు అందింతే పరిశ్రమ ఇంకాస్త కళకళలాడుతుంది. చూద్దాం.. 2025 పీపుల్ మీడియాకు గేమ్ ఛేజింగ్ మూమెంట్ తీసుకొస్తుందో, లేదో?