ఈమధ్య టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తున్న పేరు… పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. తక్కువ సమయంలోనే దాదాపు 40 సినిమాలు పూర్తి చేయగలిగారు. ఇండస్ట్రీలోని దాదాపు హీరోలందరికీ అడ్వాన్సులు ఇచ్చారు. దర్శకుల్ని బ్లాక్ చేశారు. అయితే అగ్ర హీరోలైన చిరంజీవి, మహేష్, బన్నీ, ఎన్టీఆర్, చరణ్‌లతో సినిమాలు చేయలేదు. ఆ లోటు కూడా మెల్లమెల్లగా తీర్చుకోబోతోంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. చిరంజీవితో ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తోంది. ఈ విషయాన్ని నిర్మాత టీ.జి.విశ్వప్రసాద్ స్వయంగా తెలుగు 360 ఇంటర్వ్యూలో వెల్లడించారు.
”చిరంజీవిగారితో ఓ సినిమా చేయాలని రెండేళ్ల నుంచీ అనుకొంటూనే ఉన్నాం. ఆ ప్రాజెక్ట్ దాదాపు ఆన్‌లోనే ఉంది. అతి త్వరలోనే మంచి కబురు వినిపిస్తాం” అన్నారాయన. చిరు కోసం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎప్పటి నుంచో కథలు వింటోంది. ఈమధ్య ఓ కథని లాక్ చేసినట్టు సమాచారం. ఆ కథ చిరుకి నచ్చితే ఈ సంస్థలో చిరు సినిమా ఆన్ అయిపోయినట్టే. ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ అనే సినిమా చేస్తున్నారు. 2025 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. అది మినహా కొత్తగా ఒప్పుకొన్న కథలేం లేవు. అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయాల్సింది. కానీ వీలు కాలేదు. ఆ స్లాట్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఓ సినిమా చేయొచ్చు.