ఒక ఫ్యాక్టరీ మోడల్ లో సినిమాలు చేయాలనే సంకల్పంతో నిర్మాణ రంగంలో అడుగుపెట్టారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ఆయన సంకల్పానికి తగ్గట్టే వరుసగా సినిమాలు చేస్తున్నారు. టాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు తయారౌతున్న ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీనే. అందులో సందేహం లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నారు. ‘కార్తికేయ 2’ తో నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. అయితే ఇదే సమయంలో ఆ సంస్థలో నిరాశ పరిచిన సినిమాలు సంఖ్య కూడా గణనీయంగా వుంది. ముఖ్యంగా గత కొన్నాళ్ళుగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి సరైన విజయాలు లేవు. ఈగల్, మనమే, మిస్టర్ బచ్చన్ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. మిస్టర్ బచ్చన్ చాలా నష్టాలు చూసింది. ఆ సినిమా విషయంలో జరిగిన తప్పుల్ని కూడా నిర్మాత విశ్వప్రసాద్ ఓపెన్ గానే చెప్పారు.
విజయం తెచ్చే కళ వేరు. ఇప్పుడు మళ్ళీ అలాంటి హిట్ కళ పీపుల్ మీడియా సంస్థకి కావాలి. ఈ నెలలో ఆ సంస్థ నుంచి రెండు సినిమాలు వస్తున్నాయి. శ్రీవిష్ణు ‘శ్వాగ్’, గోపీచంద్ విశ్వం. శ్రీవిష్ణు, హసిత్ గోలి, పీపుల్ మీడియా కలసి గతంలో రాజరాజ చోరతో మంచి విజయాన్ని అందుకున్నారు. శ్వాగ్ తో ఈ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతోంది. టీజర్, ట్రైలర్ కూడా ఆసక్తికరంగా వున్నాయి. గోపీచంద్, శ్రీనువైట్ల కలిసి చేస్తున్న తొలి సినిమా విశ్వం. శ్రీనువైట్ల నుంచి చాలా గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా. ట్రైలర్ లో ఆయన మార్క్ వినోదం కనిపించింది. పీపుల్ మీడియాతో పాటు గోపీచంద్, శ్రీనువైట్ల ముగ్గురికి ఈ సినిమా ఫలితం కీలకం. మళ్ళీ ఫామ్ లోకి రావాలంటే హిట్టు పడాల్సిందే. ఈ రెండు సినిమాలూ అటూ ఇటు అయితే గనుక… పీపుల్ మీడియా ‘రాజాసాబ్’ వచ్చేంత వరకూ ఆగాలి. ఈ సినిమాపైనే టీజీ విశ్వప్రసాద్ గంపెడు ఆశలు పెట్టుకొన్నారు. తమ సంస్థ ఇప్పటి వరకూ చవి చూసిన నష్టాల్ని ‘రాజాసాబ్’ భర్తీ చేస్తుందన్న నమ్మకం ఆయన మాటల్లో కనిపిస్తోంది. ఈలోగా మరో హిట్టు పడితే కాస్త ఉపశమనం కలుగుతుంది.