తక్కువ సమయంలో వంద సినిమాలు తీయాలన్న లక్ష్యంతో ముందుకొచ్చింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ‘ఈ తక్కువ రోజుల్లో’ అనే టైమ్ లైన్తో స్పీడు పెరిగింది కానీ, క్వాలిటీ తగ్గిపోయింది. ఎడా పెడా సినిమాలు తీసుకొంటూ నెలకొకటి చొప్పున టాలీవుడ్ లోకి వదులుతోంది ఈ సంస్థ. కానీ సరైన హిట్లే రావడం లేదు. రీసెంట్ గా ‘మిస్టర్ బచ్చన్’ కూడా తేడా కొట్టేసింది. ఈ సినిమాతో భారీగా నష్టపోయింది పీపుల్ మీడియా. ఇది వరకు సినిమాలేమైనా సూపర్ హిట్లు అందించాయా అంటే అదీ లేదు. పీపుల్ మీడియా సక్సెస్ రేటు 40 శాతం కూడా లేదు. నవంబరులో ఈ సంస్థ నుంచి ‘స్వాగ్’, ‘విశ్వం’ చిత్రాలు విడుదల అవుతున్నాయి. ‘స్వాగ్’ చిన్న సినిమా. హిట్టయినా భారీ లాభాలు రాకపోవొచ్చు. గోపీచంద్ – శ్రీనువైట్ల ‘విశ్వం’పై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. భారీ హిట్టు కొట్టి, కనీవినీ రీతిలో వసూళ్లు సాధించినా పీపుల్ మీడియా గత ఫ్లాపుల్ని, నష్టాల్నీ పూడ్చేంత స్టామినా ‘విశ్వం’కు ఉండదు. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ జాతకం మొత్తం ప్రభాస్ ‘రాజాసాబ్’ చేతుల్లో ఉంది.
ప్రభాస్ – మారుతి కాంబోలో రూపుదిద్దుకొంటున్న సినిమా ‘రాజా సాబ్’. వచ్చే యేడాది ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పీపుల్ మీడియా చేతుల్లో ఉన్న భారీ ప్రాజెక్ట్ ఇది. ఈ సంస్థని ముంచినా, తేల్చినా ఈ సినిమాకే సాధ్యం. ఎందుకంటే ఇది ప్రభాస్ సినిమా. తను హిట్ కొడితే… బండి వెయ్యి కోట్ల దగ్గరే ఆగేది. కాస్త యావరేజ్ టాక్ వచ్చినా రూ.500 కోట్లు తగ్గదు. మరీ ‘కల్కి’లా కాకపోయినా హిట్ అయినా మినిమం రూ.300 కోట్లు గ్యారెంటీ. అదే… పీపుల్ మీడియా భరోసా. లాభ నష్టాల మాట అటుంచితే, ఓ పెద్ద హిట్ కొట్టామన్న తృప్తి ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అత్యవసరం. అదృష్టం బాగుంటే, 2024లో వచ్చిన ఫ్లాపులన్నింటికీ ‘రాజాసాబ్’ సినిమా ఒక్కటే సమాధానం చెప్పగలదు కూడా. అందుకే పీపుల్ మీడియా ఈ సినిమాపై ప్రత్యేకమైన దృష్టి నిలిపింది. క్వాలిటీలో రాజీ పడకుండా ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. ప్రభాస్ డేట్లు కేటాయించడంలో ఇబ్బంది పెట్టినా, నిర్మాతలు ఓర్చుకొన్నారు. రిలీజ్ డేట్ విషయంలోనూ తొందర పడడం లేదు. పాన్ ఇండియా సినిమా ఇది. లాంగ్ వీకెండ్ అయితే బాగుంటుందన్న ఆలోచనతో.. ఓ మంచి డేట్ కోసం అన్వేషిస్తోంది పీపుల్ మీడియా.