మహారాష్ట్రలో గత వందేళ్లలో ఎన్నడూ చూడనంత కరువు విలయతాండవ చేస్తోంది. 21 జిల్లాల్లో తీవ్ర దుర్భిక్షం ఏర్పడింది. పంటలకే కాదు, తాగడానికీ నీళ్లు దొరకడం లేదు. మరోవైపు, ఆ రాష్ట్రంలోని ముంబై. పుణే, నాగ్ పూర్ స్టేడియంలలో మైదానాలు, పిచ్ ల నిర్వహణ కోసం గ్యాలన్ల కొద్దీ నీటిని దుమారా చేస్తున్నారు. ఇదేం న్యాయమంటూ కడుపుమండిన కొందరు బాంబే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రజలు ముఖ్యమా క్రికెట్ ముఖ్యమా అని రాష్ట్ర క్రికెట్ సంఘాన్ని ప్రశ్నించింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు వృథా కాకుండా చర్యలు తీసుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. గురువారం నుంచి దీనిపైరోజూవారీ విచారణ చేయాలని నిర్ణయించింది.
దేశంలో రైతు ఆత్మహత్యలు ఎక్కువగా జరిగే రాష్ట్రం మహారాష్ట్ర. గత కొన్ని నెలలుగా కరువు వల్ల వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎంతో మంది రైతులు పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయారు. రైతు కుటుంబాల్లో దైన్యం తాండవిస్తోంది. తాగడానికి నీళ్లు లేక లక్షల మంది అల్లాడిపోతున్నారు. ఇలాంటి సమయంలో ఐపీఎల్ క్రికెట్ వినోదం కోసం అమూల్యమైన నీటిని వృథా చేయడం అవసరమా అని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
మహారాష్ట్రలో మొత్తం 19 ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతాయి. వీటికోసం సుమారు 70 లక్షల లీటర్ల నీటిని వృథా చేయాల్సి వస్తుందని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. ఈ నీరు వేల మంది దాహాన్ని తీర్చగలదని గుర్తు చేశారు. కాబట్టి మహారాష్ట్రలో మ్యాచ్ లు నిర్వహించ వద్దని, వేరే రాష్ట్రానికి మార్చాలని పిటిషనర్లు కోరుతున్నారు.
ఈ అంశంపై బుధవారం రాత్రి పలు జాతీయ చానళ్లలో చర్చ సందర్భంగా కొందరు వితండ వాదం చేశారు. ప్రజలు షేవింగ్ చేయడానికి నీటి వాడకం తగ్గించుకోవాలని, ఏసీలు, కూలర్లు వాడకూడదని సలహాలు ఇచ్చారు. ఐపీఎల్ మాత్రం కొనసాగాలని వాదించారు. అవసరమైతే వేరే రాష్ట్రం నుంచి నీటిని రవాణా చేసి స్టేడియంల నిర్వహణకు ఉపయోగించాలని కొందరు విచిత్రమైన సలహాలను ఇచ్చారు. మొత్తానికి, కాసుల వర్షం కురిపించే ఈ టోర్నీ జరగాలని కోరిన వారిలో అందరూ కోటీశ్వరులు. కార్లు, బంగళాలు, ఏసీల్లో లగ్జరీ జీవితాన్ని గడిపే వారే. సామాన్యుల బాధలు అర్థం కాని వారు ఇచ్చిన సలహాలు విచిత్రంగా ఉన్నాయి. చివరకు ఈ విషయంలో బాంబే హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠ కలిగిస్తోంది.