ప్రత్యేక హోదా విషయంలో ఏపీ కి ఇచ్చిన మాటను కేంద్రం నిలబెట్టుకోవాలి. ప్రజలు రోడ్డు మీదికి వచ్చే పరిస్థితి రాకముందే నాయకులూ స్పందించాలి… అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఇటీవలి ట్వీట్ ద్వారా హెచ్చరించారు. ఆయన ఇంకా గుర్తించారో లేదో గానీ అనుకున్నంతా అయింది. జనం ఆల్రెడీ రోడ్డు మీదికి వచ్చారు మరి.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యెక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో అనంతపురం లో ఆదివారం నాడు పెద్ద కార్యక్రమం జరిగింది. ఏదో పార్టీ లు క్రెడిట్ కోసం చేసిన కార్యక్రమం కాదు ఇది. అప్పట్లో సమైక్యాంధ్ర కోసం ఏపీ వ్యాప్తంగా ఉద్యమం జరిగినప్పుడు కూడా, అనంతపురం ఆ సమరానికి కేంద్ర బిందువుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు హోదా కోసం పోరాటం కూడా అక్కడే ప్రారంభం అయింది. ఆదివారం జరిగిన కార్యక్రమం అచ్ఛంగా ప్రజల పోరాటం. కేంద్ర ప్రభుత్వం నాయకుల ఇటీవలి ప్రకటనలు కలిగించిన కడుపు మంట నుంచి పుట్టిన పోరాటం ఇది.
ఈ కార్యక్రమంలో చలసాని శ్రీనివాస్, సిపిఐ రామకృష్ణ ఇంకా పలువురు పాల్గొన్నారు. హోదా విషయంలో కేంద్రం వైఖరిని చలసాని శ్రీనివాస్ ఎండగట్టారు. రైల్వే జోన్ విషయంలో మోసం జరుగుతున్నదని చెప్పారు. ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని, కేంద్రం దిగి వచ్చే వరకు కేంద్రానికి కట్టవలసిన పన్నులు చెల్లించకుండా సహాయ నిరాకరణ చేయవలసిన అవసరం ఉన్నాడని పిలుపు ఇచ్చారు.
అనంతపురం లో మొదలైన ఈ ఉద్యమం అన్ని ప్రాంతాలకు అంటుకునే అవకాశం ఉంది. ఏపీ వ్యాప్తంగా త్వరలోనే ఉద్యమాలు మొదలయినా ఆశ్చర్యం లేదు. మరి జనం రోడ్డున పది అడగడం ప్రారంభం అయిపొయింది. ఈ రోజు రాకూడదని అభిలషించిన పవన్ ఈ విషయం గుర్తించాలి. ప్రజల పోరాటానికి మద్దతు ఇచ్చే ఉద్దేశం తనకు ఏ మాత్రం ఉన్నా సరే, తక్షణం ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో జరిగే ప్రతి పోరాటానికి తన మద్దతు కూడా ఉంటుందని అయన ప్రకటించాలి. దాని వలన ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉంటుంది. అలాగే పవన్ కు వీలు కుదిరితే తను కూడా ఉద్యమంలోకి రావాలి. అలా పూనుకుంటేనే రాష్ట్రానికి ఎంతో కొంత న్యాయం జరిగే అవకాశం ఉంటుంది.