ప్రధానమంత్రి నరేంద్రమోడీ మన్‌కీ బాత్‌లో ప్రజలకు భరోసా ఇచ్చారు. ప్రజలందరికీ టీకా అందిస్తామని ప్రకటించారు. అయితే ఇంత వరకూ బాగానే ఉంది కానీ… వ్యాపార ప్రకటనల్లో మాదిరి కనిపిపించి కనిపించకుండా షరుతులు వర్తిస్తాయన్నట్లుగా స్టార్ గుర్తుతో పెట్టే క్యాప్షన్ తరహాలో .. నరేంద్రమోడీ కూడా.. ఓ పదం దానికి జత చేశారు. అదేమిటంటే.. అర్హులందరికీ ఉచిత టీకా అని ప్రకటించారు. దీంతో ప్రజలు అందరూ ఉలిక్కి పడాల్సి వచ్చింది. అసలు అర్హులంటే ఎవరు.. అన్న ప్రశ్న వారి మదిలోకి రావడమే దీనికి కారణం. టీకాతీసుకోవడానికి అర్హతలేమిటో కానీ.. మొత్తానికి… “అర్హులు” అనే కేటగిరికి మాత్రమే టీకా ఉచితమని.. మిగతా వారు కొనుగోలు చేసుకోవాల్సిందేనన్న సందేశాన్ని మాత్రం.. మోడీ మన్‌కీ బాత్ ద్వారా పంపినట్లుగా అర్థమవుతుంది.
దేశ ప్రజలందరికీ..తన మన తేడా లేకుండా టీకా పంపిణీ చేయడానికి ప్రపంచంలోని అనేక దేశాలుప్రాధాన్యత ఇస్తున్నాయి. ఎందుకంటే అందరి ప్రాణాలకు ఒకే విలువ ఉంటుంది. ఇండియాలో ఆ పరిస్థితి లేనట్లుగా ఉంది. కొత్తగా అర్హుల కేటగిరి తీసుకు వచ్చి వారికి మాత్రమే ఉచిత టీకా అందివ్వనున్నాసు. ఏపీలో ఈ అర్హులు అనే పదం ఎక్కువగా వినపడుతూ ఉంటుంది. అర్హులైన వారికి పథకాలు అందిస్తామని.. ప్రభుత్వం సంక్షేమ పథకాల విషయంలో చెబుతూ ఉంటుంది. ఆ అర్హతలేనేవి.. గ్రామ గ్రామానికి మారుతూ ఉంటాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు టీకాకు కూడా అలాగే అర్హతల్ని నిర్ధారిస్తారేమోనన్న ఆందోళన ప్రజల్లో ప్రారంభమవుతుంది.
దేశంలో బీపీఎల్ కేటగిరి కింద.. సాయం చేయాలనుకుంటే ఎనభై కోట్ల మందికి సాయం చేయాల్సి ఉంటుంది. అంటే టీకా వేయాల్సి ఉంటుంది. పద్దెనిమిదేళ్లు పైబడిన వారిని లెక్కలోకి తీసుకుంటే మరో.. ఇరవై కోట్ల మంది మాత్రమే ఆ కేటగిరిలోఉండరు. ఎనభై కోట్ల మందికి ఉచిత టీకా వేసి.. ఇరవై కోట్ల మంది దగ్గర డబ్బులు వసూలు చేస్తే.. ప్రభుత్వానికి వచ్చేది చెడ్డపేరే కానీ…ప్రయోజనం ఉండదు. ఆదాయపు పన్నులు కట్టే వారు… ఎక్కువగా ఖర్చు పెట్టి.. పరోక్ష పన్నులు కట్టే వారికి ఉచితంగా ఇవ్వకుండా… వారి వద్ద నుంచి వ్యాక్సిన్‌కు డబ్బులు వసూలు చేస్తే వారిలోనూ వ్యతిరేకత ప్రారంభమవుతుంది. ఇప్పటికే సంక్షే్మ పథకాల పేరుతో.. తమ దగ్గర పన్నులు వసూలు చేసి.. పేదల పేరుతో ఓటు బ్యాంకుకు పంచి పెడుతున్నారన్న అసంతృప్తి ఉంది. ఇప్పుడు దేశానికి పన్నుల కట్టే వర్గానికి టీకా ఉచితంగా ఇవ్వకుండా అర్హులు కారు అనే ట్యాగ్ వేస్తే.. ప్రభుత్వాలకు మరింత ఇబ్బందికరం అయ్యే అవకాశం ఉంది.