హైదరాబాద్లో సాహితి ఇన్ఫ్రా అనే సంస్థ ప్రి లాంచ్ ఆఫర్ల పేరుతో భారీ రియల్ ఎస్టేట్ మోసానికి పాల్పడింది. ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుని సొంత ఇల్లు సమకూర్చుకోవాలని అనుకున్న వారి ఆశలను ఆసరాగా చేసుకుని రూ.పదిహేను వందలకోట్లు వసూలు చేసింది. మూడేళ్లు అయినా ఇంత వరకూ కనీసం నిర్మాణం ప్రారంభించలేదు సరి కదా.. చూపించిన స్థలాన్ని అమ్మేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో బాధితులు సాహితి సంస్థ ఎదుట నిరసనకు దిగారు. ఇంతకూ ఈ సంస్థ ఎవరిదంటే టీటీడీ బోర్డు సభ్యుడు లక్ష్మినారాయణది.
టీటీడీ బోర్డు సభ్యత్వం అంటే.. ప్రత్యేక ఆహ్వానితులు కాదు. నేలుగా బోర్డు సభ్యుడు. జగన్ సర్కార్ తెలంగాణ కోటాలో ఐదుగురికి చాన్సిచ్చింది. ఆ ఐదుగురిలో టీఆర్ఎస్ కోటా రెండు పోను.. మూడు వైసీపీ కోటా. ఆ కోటాలోనే లక్ష్మినారాయణ చోటు దక్కించుకున్నారు. మిగిలిన వారిలో మైహోం రామేశ్వరరావు, పార్థసారధి వంటి వారు ఉన్నారు. ఎంత పలుకుబడి ఉంటే.. లక్ష్మినారాయణ ఈ పదవి పొంది ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉంటూ నమ్మిన వాళ్లను నట్టేట ముంచేశాడు లక్ష్మినారాయణ.
వైసీపీ నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రూ. పదిహేను వందల కోట్లను వసూలు చేసి.. ఇప్పుడు ఆయన కనిపించడం లేదు. కొంత మంది ఉద్యోగులతో త్వరలో సెటిల్ చేస్తామని చెప్పిస్తున్నారు. కానీ ఆయన మాత్రం భరోసా ఇవ్వడం లేదు. వైసీపీ నేతలకు ..కీలక పదవులకు వ్యక్తులు ఇలాంటి కళంకితులే దొరుకుతారా అన్న సందేహం శ్రీవారి భక్తులకు వస్తోంది. ఇప్పటికే టీటీడీ బోర్డు సభ్యుల నేర చరిత్రపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. వీరి జాబితాలో సాహితి సంస్థ చైర్మన్ కూడా చేరనున్నారు.