లిక్కర్ బ్రాండ్లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసిన వాదన చూసిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారా లేకపోతే ప్రతిపక్ష నేతగా ఉన్నది వెంటనే ఊహించుకోవడం కష్టం. ఎందుకంటే.. ఆయన అన్నీ చంద్రబాబు తెచ్చారు.. చంద్రబాబు చేశారు.. తాము ఏమీ చేయలేదని వాదిస్తున్నారు. ఏమీ ఎందుకు చేయలేదో ఆయన చెప్పలేకపోతున్నారు. చంద్రబాబు అనతుమతి ఇస్తే మాత్రం బ్రాండ్లు అమ్మాలని ..ధిక్కరించలేని చట్టం చేసి వెళ్లారా ? అవే బ్రాండ్లు.. ఆ బ్రాండ్లు మాత్రమే అమ్మాలని నిబంధనలు పెట్టాడా ? ఆ లిక్కర్‌ను వేల కోట్లతో ఆదాయం తెచ్చుకోవాలని చెప్పాడా ? . సీఎం జగన్ ప్రజల ఐక్యూని మరీ దారుణంగా.. దారుణాతి దారుణంగా ఊహించుకుని ఈ వాదనలు చేస్తున్నట్లుగా ఉన్నారు.
తాను తెచ్చిన బ్రాండ్లే అమ్మాలని చంద్రబాబు చట్టం చేశారా?
చంద్రబాబు హయాంలో అనుమతి ఇచ్ాచరంటూ సీఎం జగన్ అసెంబ్లీలో కొన్ని పత్రాలు ప్రదర్శించారు. అనుమతి ఇస్తే మాత్రం ఈ ప్రభుత్వం ఎందకు ఆ బ్రాండ్లను.. ఇంకా చెప్పాలంటే ఆ బ్రాండ్లను మాత్రమే అమ్ముతుందో సీఎం జగన్ ఎందుకు చెప్పలేదనేది ఇప్పటికీ సస్పెన్స్ ధ్రిల్లర్గానే ఉంది. చంద్రబాబు అనుమతి ఇచ్చారని.. అన్ని రకాల కంపెనీలను.. పెట్టుబడులను.. అభివృద్ధి పనులను కాంట్రాక్టులను.. రివర్స్ చేసి పడేసిన జగన్… ఈ లిక్కర్ బ్రాండ్లను మాత్రమే ఎందుకు అమ్ముతున్నారు. సీఆర్డీఏ చట్టం లాగా.. తాను తీసుకు వచ్చిన కంపెనీలు… అవి తయారు చేసిన లిక్కర్లు మాత్రమే అమ్మాలని చంద్రబాబు చట్టం చేసి ఉంటే.. ఆ పత్రాలు కూడా బయట పెట్టి ఉండాల్సింది. ప్రజలు జగన్ ఈ నాసిరకం బ్రాండ్లను అమ్మకుండా నిషేధించడానికి చేత కావడం లేదని అనుకునేవారు.
ప్రఖ్యాత బ్రాండ్లను ఎందుకు అందుబాటులో ఉంచడం లేదు.. చంద్రబాబు బ్రాండ్లనే ఎందుకు అమ్ముతున్నారు !?
సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీలో మద్యం వ్యాపారం ఏ దిశగా వెళ్లిందో అందరూ చూస్తూ నే ఉన్నారు. మెక్ డోవల్ లాంటి బడా కంపెనీల లిక్కర్ కనిపించకుండా పోయింది. అది అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో ఉండే కంపెనీ. అలాంటి కంపెనీలు కనిపించకుండా పోయాయి. వీటి లిక్కర్నుఎందుకు ఏపీలో అమ్మనీయడం లేదు. ఎందుకు చంద్రబాబు బ్రాండ్లనే ప్రమోట్ చేస్తున్నారు. ఈ విషయంలో సమాధానం చెప్పలేకపోతే ప్రజలు మరో రకంగా అనుకునే ప్రమాదం ఉంది. ఈ విషయంలో జగన్ ముందడుగు వేయకపోతే.. ఆయన సీఎంనేనా అన్న డౌట్ ప్రజలకు సహజంగానే వస్తుంది.
లిక్కర్ కంపెనీలు టీడీపీ వాళ్లవయితే ఎందుకు ప్రోత్సహిస్తున్నారు !
సీఎం జగన్ అసెంబ్లీలో డిస్టిలరీస్ టీడీపీ నేతలవని చెప్పారు. అయితే ఎందుకు ఆయన ఆ డిస్టిలరీస్‌ను మూసివేయించలేదో చెప్పలేకపోయారు. వారు తయారు చేసే మద్యాన్ని అత్యున్నత ల్యాబ్‌లలో పరీక్షించి.. తేడా ఉండే మూసేసి కేసులు పెట్టి ఎందుకు వాళ్లను మూసేయలేదనేది ఇక్కడ మౌలికమైన ప్రశ్న. టీడీపీ వాళ్లు డిస్టిలరీస్ పెట్టి చీప్ లిక్కర్ తయారు చేసి ప్రజల్ని చంపుతూంటే చూస్తూ ఉరుకుంటారా ? ఆ మద్యాన్నే వేల కోట్లకు అమ్ముకుని సంక్షేమ పథకాల్ని అమలు చేస్తారా ? అంటే అమ్మఒడి డబ్బులు టీడీపీ నేతలు ఇస్తున్నట్లా ?
సీఎం జగన్ చేయలేని ప్రతి పనిని చంద్రబాబు పేరు చెబుతున్నారు. ఇవి రాను రాను ఎక్కువైపోతున్నాయి. ఎక్కువైపోవడం కాదు.. మొత్తం చంద్రబాబే కనిపిస్తున్నారు. ఇలా అయితే ప్రజలు ఇంత దానికి జగన్ ఎందుకు.. చంద్రబాబు ఉంటేనే బెటర్ కదా అనే ఆలోచనకు వస్తారు. అదే జరిగితే ఏమవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.