జనం కోసం జగన్- జగన్ కోసం జనం.. పార్టీ పరిస్థితులు ఎటుపోయి ఎటు వచ్చినా.. వారు చెప్పుకునే ఈ నినాదంలో మాత్రం తిరుగులేదు. అయితే జనం సంక్షేమం కోసం వైఎస్ జగన్మోహనరెడ్డి ఈసారి పరమశివుడికి రుద్రాభిషేకం చేయబోతున్నారా? రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించడానికి, ఇబ్బందులు లేకుండా బతకడానికి ఆయన పరమశివుడికి భారీ స్థాయిలో రుద్రాభిషేకం కార్యక్రమం నిర్వహిస్తారా? అనే చర్చ ఇప్పుడు మొదలైంది.
జగన్ తన లోటస్పాండ్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో ఆయన పార్టీ పండితుడు మారేపల్లి రామచంద్రశాస్త్రి సహజంగానే.. ఆయనకు అనుకూలమైన రీతిలో పంచాంగ గ్రహనిర్దేశాలను చదివి వినిపించారు. ఇదంతా ఎక్కడైనా మామూలే అనుకున్నప్పటికీ.. ఆయన చెప్పిన కొన్ని సంగతులు మాత్రం గమనించదగినవి.
ఈ ఏడాది వర్షాలు బాగా ఉంటాయని అన్ని పార్టీల పండితులూ చెబుతున్నారు. నిజానికి వాతావరణ శాస్త్రవేత్తలు కూడా ఈ ఏడాది ఎండల మాదిరిగానే వానలు కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని చాలాకాలం ముందునుంచే చెబుతున్నారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పండితుడు మాత్రం వర్షాలు బాగా కురుస్తాయి గానీ.. అకాల వర్షాలు కురిసి పంటలకు నష్టం వాటిల్లుతుందంటూ అశుభం కూడా సెలవిచ్చారు. అయితే పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేస్తే ప్రజలు సుఖశాంతులతో ఉంటారని ఆయన సెలవిచ్చారు.
తమ పార్టీ పండితుడు చెప్పిన పరిష్కారం ప్రకారం రాష్ట్ర ప్రజల్ని సుఖశాంతులతో అలరింపజేయడానికి వైఎస్ జగన్మోహనరెడ్డి భారీ స్థాయిలో పరమశివుడి రుద్రాభిషేకం కార్యక్రమానికి పూనుకుంటారా? లేదా చంద్రబాబు నాయుడు పాలనలో సుఖసంతోషాలతో ఉండకపోతే మాత్రం తన వైఫల్యం కిందికి కాదు కదా అని సరిపెట్టుకుని ఊరకుంటారా? అనేది నలుగురూ మాట్లాడుకుంటున్నారు.