నరేంద్రమోడీ .. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు. ఇప్పటికి మోడీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటిపోయింది. మరి ఆయన హామీ నెరవేర్చుకున్నారా..? నెరవేర్చుకున్నారనే.. గణాంకాలు బయటకు వచ్యాయి. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు.. కచ్చితంగా ఉడగొట్టారని.. మాత్రం ఆ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కల్పించలేదు.. ఊడగొట్టారు. ఇచ్చిన హామీకి రివర్స్‌లో ఉన్నప్పటికీ.. చేశారు. ఆర్థిక మందగమనం వల్ల… ప్రపంచవ్యాప్తంగా ఏదైనా సంక్షోభం ఏర్పడటం వల్లనో.. ఈ ఉద్యోగ సంక్షోభం రాలేదు… కేవలం.. నరేంద్రమోడీ తీసుకున్న… నోట్ల రద్దు అనే నిర్ణయం వల్లే.. అసలు విపత్తు వచ్చి పడింది. ఇలాంటి విషయాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించదు కాబట్టి.. ఏదో విధంగా లీక్ కావాలి. అలాగే లీకయ్యాయి.
జాతీయ నమూనాల సర్వే కార్యాలయం ఈ లెక్కలన్నీ వేస్తూ ఉంటుంది. ఈ కార్యాలయంలో రూపొందిన నివేదిక.. హఠాత్తుగా లీకయింది. 2017 జులై నుంచి ఈ ఏడాది జూన్ మధ్య దేశంలో నిరుద్యోగిత 6.1 శాతం ఉంది. 1972-73 తర్వాత ఇదే అత్యధికం. పెద్దనోట్లను రద్దు చేస్తూ 2016 నవంబరులో కేంద్ర సర్కారు నిర్ణయం తీసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు దారుణంగా పడిపోయాయని నివేదిక వివరించింది. గ్రామీణ యువతీయువకుల్లో గత అయిదేళ్లలో నిరుద్యోగ సమస్య మూడింతలకు పైగా పెరిగింది. సహజంగానే ఈ గణాంకాలు ప్రభుత్వానికి నచ్చవు. అందుకే విడుదల చేయడం లేదు. నివేదికను రెడీ చేశారు. డిసెంబర్లోనే… ముద్రించాల్సి ఉంది. కానీ గణాంకాలకు ఆమోదం ఇవ్వకుండా..అలా ఉంచి.. కొత్త నివేదికలతో.. మసి పూసిమారేడు కాయ చేసే ప్రయత్నం చేయడంతో.. రెండు రోజుల కిందటే.. జాతీయ గణాంక కమిషన్ తాత్కాలిక ఛైర్మన్ పి.సి.మోహనన్, మరో సభ్యురాలు జె.మీనాక్షి రాజీనామా చేశారు. గణాంకాలపై ఇతర ప్రభుత్వ సంస్థల జోక్యం వంటివి వారు కారణాలుగా పేర్కొని ఈ నిర్ణయం తీసుకున్నారు.
దీనిపై సహజంగానే రాజకీయ దుమారం రేగింది. ప్రభుత్వం అబద్దం అని చెప్పడం లేదు కానీ.. ఇంకా ఆమోదం పొందలేదనే వాదన తీసుకొచ్చింది. ప్రభుత్వం తరపున నీతిఆయోగ్ రంగంలోకి దిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం..మోడీపై తీవ్ర విమర్శలు చేస్తోంది. ఈ విషయం ప్రజల్లోకి కూడా గట్టిగా వెళ్లింది. నిజానికి తన నాలుగున్నరేళ్ల పనితనాన్ని గొప్పగా ప్రజల ముందు ఉంచేందుకు కేంద్రం ఏర్పాట్లు చేసుకుంది. కానీ ప్రభుత్వం ఏం చెప్పినా… అసలు నిజాలు మాత్రం వేరే ఉండబోతున్నాయని.. ఈ నిరుద్యోగిత గణాంకాలతో బయటపడిపోయింది.