తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ హోదా కోల్పోయి ఆరు నెలలయింది. ప్రజలు.. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాలా.. వద్దా అన్నంతగా ఆలోచన చేసి.. చివరికి 23 సీట్లతో సరిపెట్టారు. ఈ ఫలితంతోనే టీడీపీ పూర్తిగా జావకారిపోయింది. ప్రతిపక్ష పాత్రలో.. ఎలా వ్యవహరించాలో… అసలు తమకు అంత ఘోర పరాజయం ఎదురవడానికి కారణాలేమిటో కూడా.. విశ్లేషించుకోలేకపోయింది. ఆ తప్పటడుగులు అలా వేస్తూ.. ఆరు నెలలు కానిచ్చేసింది. భారీ మెజార్టీ ఉన్న ఓ అధికార పార్టీని ఎదుర్కోవడంలో… చూపించాల్సినంత రాజకీయ దూకుడు.. టీడీపీ చూపించలేకపోయింది.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారా..?
ప్రతిపక్షం ప్రధాన బాధ్యత.. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయడం. జగన్మోహన్ రెడ్డి ఆరు నెలల పాలనపై.. అదే పనిగా విమర్శలు చేసిన.. తెలుగుదేశం పార్టీ వాటిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయిందనే.. మాట గట్టిగానే వినిపిస్తోంది. ఇసుక దగ్గర్నుంచి… ఇంగ్లిష్ మీడియం వరకూ.. ప్రతి ప్రభుత్వ నిర్ణయాన్ని టీడీపీ తప్పు పట్టింది. కానీ.. ఆయా నిర్ణయాల వల్ల ప్రజలకు.. ప్రత్యక్షంగా..పరోక్షంగా నష్టం జరగబోతోందని.. వాదించి.. ప్రజల్లోకి వెళ్లి చేసిన పోరాటాలు తక్కువే. ప్రజలతో సంబంధం లేకుండా… పార్టీ తరపు ధర్నాలు, రాస్తారోకోలు.. ప్రెస్మీట్లు.. ట్వీట్లతోనే .. ఆరు నెలలు గడిచిపోయాయి. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలపై… ప్రతిపక్ష పార్టీగా చేయాల్సినంత పోరాటం మాత్రం టీడీపీ చేయలేకపోయింది.
ఓటమి కారణాలు వెదుక్కోవడంలోనూ… వెనుకబాటే..!
తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంది సాధారణమైన ఓటమి కాదు. పునాదులు కదిలిపోయే ఓటమి. రాష్ట్రం కోసం.. సర్వం త్యాగం చేసి కష్టపడ్డానని… చంద్రబాబునాయుడు ప్రజలకు చెప్పుకున్నా… తన ప్రగతిని కళ్ల ముందే పెట్టినా.. ప్రజలు జగన్మోహన్ రెడ్డికి చాన్సిచ్చారు. తప్పు ఎక్కడ జరిగిందో.. చంద్రబాబునాయుడు ఇప్పటికీ రియలైజ్ కాలేకపోతున్నారు. తాము కష్టపడినా.. ప్రజలు తమకు అన్యాయం చేశారనే వాదననే.. టీడీపీ నేతలు వినిపిస్తున్నారు కానీ.. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో.. విశ్లేషణ చేసుకోలేకపోతున్నారు. జరిగిన తప్పులను తెలుసుకుని.. దిద్దుకుందామనే ప్రయత్నాలు కూడా చేయడం లేదు. తప్పులు తెలుసుకుని.. మళ్లీ జరగకుండా… చూసుకుంటేనే… భవిష్యత్‌లో విజయానికి బాటలు పడతాయని.. టీడీపీ అధినేత చెబుతూంటారు. కానీ ఆయన మాత్రం.. దీన్ని పాటించడం లేదనే విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి.
పార్టీ క్యాడర్లో ధైర్యం నింపేది ఇలాగేనా..?
ఓ వైపు ఘోర పరాజయం షాక్ నుంచి తేరుకోక ముందే.. అధికార పార్టీ వేధింపులు.. తెలుగుదేశం పార్టీ క్యాడర్‌ను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ సమయంలో.. పార్టీ అధినేతగా చంద్రబాబు.. అండగా ఉంటామనే ప్రకటనలు చేస్తున్నారు తప్ప.. కార్యాచరణతో.. వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేయడం లేదు. కష్టాలు పడినా.. భవిష్యత్‌కు భరోసా ఉంటుందని.. చేతలతో చెప్పే ప్రయత్నం జరగడం లేదు. నేతలు పోకుండా.. కాపాడుకోవాల్సిన పరిస్థితి లేదు. కేసులు పెట్టో.. ఆర్థిక దిగ్బంధనం చేసో.. మరో రకంగానే.. టీడీపీ నేతల్ని పార్టీకి దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటిని అడ్డుకునే ప్రయత్నాలు… అధినాయకత్వం చేయడం లేదు. ఫలితంగా.. టీడీపీ క్యాడర్లో రాను రాను నిస్తేజం పెరిగిపోతోంది. భవిష్యత్‌పై భరోసా తగ్గిపోతోంది.
ప్రజలు.. అధికార పార్టీ పాలన తీరును చూసి..మాత్రమే ఐదేళ్ల తర్వాత తీర్పు చెప్పరు. ప్రతిపక్ష పార్టీ తన బాధ్యతలు ఎలా చేసిందో… ఆ పార్టీకి అధికారం ఇస్తే.. తాము అనుకున్నట్లుగా చేయగలుగుతుందో లేదో చసి ఓట్లు వేస్తారు. ఈ విషయంలో .. టీడీపీకి తొలి ఆరు నెలల్లో పాస్ మార్కులు పడలేదు.