జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏలూరుకు ఓటు హక్కు మార్చుకుంటూ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది! ఇకపై, జనసేన పార్టీ కార్యకలాపాలకు కేరాఫ్ అడ్రస్ ఏలూరు కాబోతోందని చెప్పుకోవచ్చు. తెలంగాణ నుంచి ఆంధ్రా విడిపోయాక ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడకు వెళ్లారు. రాజధాని ప్రాంతానికి నివాసం మార్చేశారు. ఇప్పుడు జనసేన కూడా ఏపీకి వెళ్లిపోతోంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్రా ప్రాంతంలో ఆఫీస్ చూసుకుంది. ఇక, మిగిలింది… ప్రధాన ప్రతిపక్షం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. నిజానికి, 2019 ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని ధీమాగా చెబుతున్న వైయస్ జగన్ మాత్రం ఆంధ్రాకి మకాం మార్పు గురించి మాట్లాడటం లేదు! నిజానికి, ఇదే చర్చ గతంలో కూడా తెరమీదికి వచ్చింది. ఇప్పుడు పవన్ నిర్ణయం తరువాత ఇదే అంశం మరోసారి ప్రముఖంగా వినిపిస్తోంది.
తెలుగుదేశం, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు రాష్ట్రస్థాయిలో నిర్వహించే అన్ని అధికారిక కార్యకలాపాలూ ఆంధ్రా ఆఫీసుల్లోనే జరుగుతున్నాయి. కానీ, ప్రధాన ప్రతిపక్షమైన వైకాపా ఆంధ్రా వ్యవహారాలకు హైదరాబాద్ వరకూ వెళ్లాల్సి వస్తోంది. పార్టీకి సంబంధించి ఏ కీలక సమావేశమైనా నాయకులు లోటస్ పాండ్‌కు రావాల్సిన పరిస్థితి. అంతేకాదు, ఆంధ్రాలో ఏ ఉద్యమం చేప్టటినా హైదరాబాద్ నుంచే జగన్ బయలుదేరి వస్తారు. రాష్ట్రానికి సంబంధించి కీలక అంశాలపై ప్రతిపక్ష ప్రెస్ మీట్లన్నీ హైదరాబాద్‌లోనే ఉంటున్నాయి.
నిజానికి తెలంగాణలో వైకాపా ఉనికి లేకుండా పోయింది! వచ్చే ఎన్నికల్లో కూడా తెలంగాణలో వైకాపా ఏదో సాధించేస్తుందన్న సూచనలు లేనేలేవు. అలాంటప్పుడు, ఇంకా హైదరాబాద్ అంటూ వేలాడటం సరైంది కాదనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల నుంచే వ్యక్తమౌతోంది. జగన్ మకాం మార్పుపై త్వరగా ఓ నిర్ణయం ప్రకటించకపోతే, ఈ ఆలస్యం తెలుగుదేశం పార్టీకి ఒక అవకాశంగా మారుతుందన్న అభిప్రాయం వైకాపా వర్గాల్లో ఉంది. ఈ విషయంలో పవన్ కాస్త ముందుడటం కూడా వైకాపాకి కాస్త ఇబ్బంది కలిగించే అంశంగానే చెప్పుకోవాలి! ఇదే కాదు, ఆంధ్రాలో ఏ ఉద్యమం తీసుకున్నా… ఏ ప్రజా సమస్యపై స్పందించాలన్నా ప్రధాన ప్రతిపక్షం కంటే ముందుగానే పవన్ రంగంలోకి దిగేస్తున్నారు! రాజధాని నిర్వాసితుల సమస్య మొదలుకొని నిన్నమొన్నటి తుందుర్రు ఆక్వా రైతుల సమస్య వరకూ… ప్రతిపక్ష పార్టీ పాత్రను జనసేన నెత్తినేసుకుని ముందుకు దూకుతోంది! ఇప్పుడు కూడా జగన్ కంటే ముందుగానే పవన్ ఆంధ్రాకి షిఫ్ట్ అవుతున్నారు. మరి, ఈ ధోరణిని జగన్ గమనిస్తున్నారో లేదోగానీ, వైకాపా శ్రేణుల్లో మాత్రం ఈ ఆందోళన ఉంది.