లాక్ డౌన్ వల్ల చిత్రసీమ స్థంభించిపోయింది. షూటింగులు ఆగిపోయాయి. మళ్లీ షూటింగులు ఎప్పుడు మొదలవుతాయో తెలీదు. కాకపోతే… బుల్లితెర షూటింగులకు అనుమతి అతి తొందర్లో లభించే అవకాశాలున్నాయి. సినిమా తరవాత….టీవీ పరిశ్రమ అత్యంత పటిష్టమైనది. వేలాది మందికి ఉపాధినిస్తోంది. లాక్ డౌన్ వల్ల టీవీ షూటింగులు కూడా ఆగిపోయాయి. దాంతో సీరియళ్లు బంద్ అయ్యాయి. వాటిపై ఆధారపడి జీవిస్తున్న వందలాదిమంది ఇప్పుడు ఖాళీగా ఉన్నారు. వీలైనంత త్వరగా తమ టీవీ షూటింగులకు అనుమతి ఇవ్వాలని టెలివిజన్ సమాఖ్య తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. టీవీ సీరియళ్లు తెరకెక్కించడానికి పరిమితమైన సభ్యులు సరిపోతారని, లాక్ డౌన్ నిబంధనల్ని దృష్టిలో ఉంచుకుని, షూటింగులు చేసుకుంటామని, అందుకు అనుమతి ఇవ్వాలని కొన్ని టీవీ ఛానళ్లు ప్రభుత్వాన్ని కోరాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ హామీ ఇచ్చారు. నిజానికి టీవీ సీరియళ్లన్నీ ఇండోర్లోనే జరిగిపోతుంటాయి. ఓ పెద్ద ఇళ్లు, అందులో అత్తా కోడళ్ల మధ్య సంభాషణలతోనే సగం టీవీ సీరియళ్లు నడిచిపోతుంటాయి. అందుకే… ప్రభుత్వం అనుమతి ఇవ్వడానికి కూడా పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవొచ్చు. కానీ సినిమా షూటింగులు అలా కాదు. చిన్నదైనా, పెద్దదైనా కనీసం 100మంది క్రూ ఉండాల్సిందే. అందుకే సినిమా షూటింగులకు ఇప్పట్లో అనుమతులు లభించకపోవచ్చు.