తెలంగాణ జన సమితి (టి.జె.ఎస్.) తొలి విజయం సాధించిందనే చెప్పాలి. కొత్త పార్టీని కోదండరామ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, పార్టీ ఆవిర్భావ సభ ఎక్కడ నిర్వహిస్తారూ, ఎప్పుడు నిర్వహిస్తారనే అంశంపై నేటి వరకూ సస్పెన్స్ కొనసాగుతూనే వచ్చింది. మొదట్లో వరంగల్ అనుకున్నారు. ఆ తరువాత, హైదరాబాద్ కి వేదిక మార్చారు. అక్కడి నుంచి అనుమతుల సమస్య కోదండరామ్ ను వెంటాడింది. నిజాం కాలేజ్ గ్రౌండ్ లో పెడదామనుకుంటే పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఎన్టీఆర్ స్టేడియం అడిగినా అదే పరిస్థితి..! పేరేడ్ గ్రౌండ్ లో అయినా అనుమతి ఇవ్వాలంటూ పార్టీ అర్జీ పెట్టుకుంది. అయినాసరే, పోలీసులు కుదరదు అన్నారు. చివరికి సరూర్ నగర్ స్టేడియంలో సభ పెట్టుకుంటామని టీజేయస్ కోరింది. అక్కడ కూడా రకరకాల కారణాలతో రాచకొండ పోలీసులు అనుమతి ఇవ్వలేదు.
దీంతో కోదండరామ్ హైకోర్టును ఆశ్రయించారు. పార్టీ దాఖలను చేసిన పిటీషన్ ను కోర్టు విచారించింది. తెలంగాణ జన సమితి సభకు అనుమతి ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాదు, అనుమతుల కోసం మరోసారి రాచకొండ పోలీసులకు దరఖాస్తు చేసుకోవాలని పార్టీకి కోర్టు సూచించింది. పార్టీ నేతలు దరఖాస్తు పెట్టిన వెంటనే మూడు రోజుల్లోగా సభ నిర్వహణకు అనుమతులు ఇవ్వాలని రాచకొండ పోలీసులను కోర్టు ఆదేశించింది. దీంతో ఆవిర్భావ సభ నిర్వహణపై నెలకొన్న సస్పెన్స్ తొలిగినట్టయింది.
అయితే, ఇది తొలి విజయం అంటూ టీజేయస్ మద్దతుదారులు అంటున్నారు. ఆవిర్భావ సభను అడ్డుకోవడం కోసం ఎన్ని రకాలు కుట్రలు జరిగినా, చివరికి న్యాయం తమవైపే ఉందని అభిప్రాయపడుతున్నారు. తాజా తీర్పుతో ఈ నెల 29 నిర్వహించబోయే సభ ఏర్పాట్లలో కోదండరామ్ నిమగ్నమైనట్టు తెలుస్తోంది. ఈ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు. నిజానికి, జన సమితి ఆవిర్భావ సభకు రకరకాల కారణాలతో అధికారులు అనుమతి నిరాకరిస్తుండటంతో విమర్శలు పెరిగాయి. తాము సభ పెడతామంటే వాహనాలూ కాలుష్యం అని అడ్డుపడుతున్నారనీ, భరత్ అనే నేను సినిమా వేడుకలకి ఎల్బీ నగర్ స్టేడియంలో ఎలా అనుమతి ఇచ్చారంటూ కోదండరామ్ ఇటీవలే మండిపడ్డ సంగతి తెలిసిందే. ఈరోజు కోర్టు నుంచి సానుకూల ఆదేశాలు రావడంతో తెలంగాణ జన సమితి శ్రేణుల్లో ఉత్సాహం నిండింది.