సినిమాటిక్కెట్ల అంశంలో ప్రభుత్వం తన వాదనను సమర్థించుకోవడానికి అపసోపాలు పడుతోంది. పేదలను దోచుకుంటున్నారని.. దానికి మాత్రమే అడ్డుకట్ట వేశామని చెప్పుకునేందుకు తంటాలు పడుతోంది. రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్లు వేసే ప్రశ్నలకూ అదే సమాధానం అవుతోంది కానీ.. అసలైన ఆన్సర్ మాత్రం చెప్పలేకపోతోంది. రామ్ గోపాల్ వర్మ వేసిన పది ప్రశ్నలకు పేర్ని నాని స్పందించారు. దేనికీ సూటిగా సమాధానం చెప్పలేదు. అన్ని డొంకతిరుగుడుగా చెప్పడమే కాదు.. టిక్కెట్ రేట్లతో పేదలను దోచుకుంటున్నారన్న పాత మాటనే పదే పదే చెప్పారు.
సినిమా టిక్కెట్ నిర్ణయంలో ప్రభుత్వ పాత్ర ఏమిటని వర్మ అడిగిన ప్రశ్నకు పేర్ని నాని అసలు సినిమా వస్తువే కాదని తీర్మానించారు. అదో వినోద సేవ కాబట్టి … ధర నిర్ణయిస్తామని తేల్చేశారు. సినిమా హీరోల రెమ్యూనరేషన్ ఆధారంగా సినిమా టిక్కెట్ల ధరలను ఏ ప్రభుత్వమూ నిర్ణయించన్నారు. సినిమాను ప్రభుత్వం నిత్యావసరంగా భావిస్తే రేషన్ ధియేటర్లు పెట్టాలని ఆర్జీవీ సలహా ఇచ్చారు. అయితే తాము సినిమాను నిత్యావసరంగా కానీ.. అత్యవసరంగా కానీ గుర్తిచబోమన్నారు. వర్మ ఎప్పుడూ నిర్మాణ కోణంలోనే ఆలోచిస్తున్నారని.. వినియోగదారుని కోణంలో ఆలోచించాలని చెప్పుకొచ్చారు.
రూ. వంద టిక్కెట్‌ను వెయ్యి.. రెండు వేలకు అమ్ముకోవడం దోపిడి అని పేర్ని నాని చెప్పుకొచ్చారు. అలాంటి దోపిడిని అడ్డుకుంటామన్నారు. మొత్తంగా ఆర్జీవీ అడిగిన ప్రశ్నలకు పేర్ని నాని వద్ద ఉన్న ఆన్సర్ పడికట్టు పదాలే తప్ప.. సూటిగా స్పష్టంగా లేవు. వినేద ప్రాంగణాలు.. వినోద సవలు..అత్యవసరాల కాదు అంటూ ప్రభుత్వం ఎందుకు కట్టడి చేయాలనుకుంటుందో ఆయన సమర్థించలేకపోయారు. ఏపీలో నిత్యావసర వస్తువుల ధరలను కట్టడి చేయకుండా సినిమా టిక్కెట్ల మీద పడి ఈ రగడ సృష్టించడం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఆర్జీవీ చర్చతో ఏపీ లో ఉన్న నిత్యావసర వస్తవులు.. ,ఇతర రాష్ట్రాల్లో ఉన్న ధరలతో పోల్చి చూసి నెటిజన్లు ప్రశ్నించడం ప్రారంభించారు.