పేర్ని నాని కుటుంబంతో సహా కనిపించకుండా పోయారు. ఆయన గోడౌన్ లో నిల్వ చేసిన పీడీఎస్ బియ్యాన్ని మాయం చేయడంతో ఆయన భార్య జయసుధపై కేసు నమోదు అయింది. దీంతో అరెస్టు చేస్తారేమోనన్న భయంతో భార్య, కుటుంబసభ్యులతో సహా ఆయన ఆజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ రోజు వైసీపీ నేతలు ఓ ధర్నా కార్యక్రమాన్ని తలపెట్టారు. ఆ కార్యక్రమంలో పాల్గొనడం కూడా డౌటేనని చెబుతున్నారు. నిజానికి పేర్ని నానిపై కేసు పెట్టలేదు. ఆయన భార్యపై పెట్టారు. కానీ తన భార్యను ఆజ్ఞాతంలోకి పంపి తాను బయట తిరగడం బాగోదని ఆయన కూడా కనిపించడం లేదు.
కేసు నమోదైనప్పటి నుండి పేర్ని నాని కనిపించడం లేదని వైసీపీ క్యాడర్ గుసగుసలాడుకుంటున్నారు. వేబ్రడ్జిలో లోపాలు ఉండటం వల్లే ఎక్కువ బియ్యం ఉన్నట్లుగా నమోదు అయిందని వాదిస్తున్నారు. అదే నిజమైతే ఆయన భయపడి పారిపోవాల్సిన పనిలేదు. కానీ ఎంత బియ్యం మిస్ అయిందో అంత మొత్తానికి డబ్బులు ఇస్తామని లేఖలు కూడా రాశారు. అంటే ఉద్దేశపూర్వకంగానే తరలించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అడ్డంగా దొరికిన వారిపై కేసులు పెట్టడమే కానీ వైసీపీ హయాంలోలా అర్థరాత్రి ఇళ్ల గోడలు దూకి అరెస్టులు చేయడం లేదు. వారికి న్యాయపరమైన అవకాశాలు అన్నీ పోలీసులు ఇస్తున్నారు. ఇప్పుడు వీరికి కూడా అలాంటి అవకాశాలు ఇస్తారు. కళ్ల ముందు లేరు కాబట్టి అజ్ఞాతంలో ఉండి తమ ముందస్తు బెయిల్ ప్రయత్నాలను వారు చేసుకుంటున్నారు. కాలం ఎప్పుడూ ఒకలాగే ఉండదని పేర్ని నాని లాంటి వాళ్లకు ఇలాంటి పరారీల వల్ల తెలిసి వచ్చే అవకాశం ఉంది.