హైదరాబాద్: గుడివాడలో నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొడాలి నాని అరెస్ట్ అవగా, ఇవాళ మచిలీ పట్నంలో అదే పార్టీ నేత పేర్ని నాని అరెస్ట్ అయ్యారు. బందరు పోర్ట్కు భూ సేకరణ, మద్యం దుకాణాలపై ఎక్సైజ్ అధికారుల వేధింపులకు నిరసనగా ఇవాళ పేర్ని నాని బందరులో ధర్నాకు దిగారు. మీ భూమి-మీ ఇంటికి కార్యక్రమాన్ని అడ్డుకోవటంతోపాటు, ఎస్ఐను దూషించారన్న ఆరోపణలపై పోలీసులు నానిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. నానికి ఈ నెల 27వ తేదీ వరకు కోర్ట్ రిమాండ్ విధించింది. అతని బెయిల్ పిటిషన్ను కోర్ట్ తిరస్కరించటంతో సబ్ జైలుకు తరలించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పేర్ని నానికి ఫోన్ చేసి మాట్లాడారు. అరెస్టుకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికార పక్ష వేధింపులపై పోరాడదామంటూ నానికి భరోసా ఇచ్చారు. మరోవైపు కొడాలి నాని బందరులో మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష నేతలను వేధిస్తోందని విమర్శించారు. భూసేకరణపై ప్రజల తరపున పోరాడుతున్న పేర్ని నానిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారని మండిపడ్డారు. ఈ విషయంలో తప్పు లేదని భావిస్తే చర్చకు రావాలని, హైదరాబాద్లో పోలీసులు నిష్పక్షపాతంగా ఉంటారని, అక్కడ తేల్చుకోవటానికి చంద్రబాబు సిద్ధమా అని అన్నారు. చంద్రబాబు ప్రజా వ్యతిరేక, కక్షపూరిత విధానాలపై పోరు తీవ్రతను మరింతగా పెంచుతామని ప్రకటించారు.