ఏలూరు కలెక్టర్‌తో వివాదం పెట్టుకున్న పేర్ని నాని తెగేదాకా లాక్కుంటున్నారన్న అభిప్రాయం కల్పిస్తున్నారు. కృష్ణా జిల్లా జడ్పీ సమావేశానికి ఏలూరు కలెక్టర్ రాలేదని ..సీఎం ఇంటి ముందు ధర్నా చేస్తానని హెచ్చరించిన ఆయన… ఈ సారి అదే మాటను.. సచివాలయంలో చెప్పారు. ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్‌పై ఫిర్యాదు చేసేందుకు పేర్ని నాని సెక్రటేరియట్‌కు వచ్చారు. సీఎస్‌తో భేటీ అయిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏలూరు కలెక్టర్ తీరును విమర్శించడంతో పాటు.. మరోసారి జగన్ ఇంటి ముందు ధర్నా చేస్తానని ప్రకటించారు.
పేర్ని నాని ఈ ప్రకటన చేస్తున్న సమయంలో ఏలూరు ఎమ్మెల్యే ప్రసన్న వెంకటేష్ సీఎం క్యాంప్ కార్యాలయంలో ఉన్నారు. పేర్ని నాని తీరుపై ఆయన సీఎంవోలో ఫిర్యాదు చేశారు. కృష్ణా జిల్లా జడ్పీ సమావేశానికి ఏలూరు కలెక్టర్ వెళ్లాల్సిన పని లేదని ఆయన చెబుతున్నారు. మామూలుగా అయితే.. అధికారులు సీఎస్ వద్దకు.. రాజకీయ నేతలు క్యాంప్ ఆఫీసుకు రావాలి.కానీ ఇక్కడ భిన్నంగా మాజీ మంత్రి సీఎస్ వద్దకు వెళ్తే.. ఐఏఎస్ ఆఫీసర్ ప్రసన్న వెంకటేష్ సీఎం క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లారు.
దీంతో ఈ ఇద్దరి మధ్య అసలు వివాదం కాకుండా కొసరు వివాదం కూడా ఏదో ఉందన్న చర్చ జరుగుతోంది. ఈ విషయంలో సీఎం కూడా పట్టించుకోనందుకే.. తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తపరిచేందుకు సీఎం ఇంటి ముందు ధర్నా అంటున్నారని చెబుతున్నారు. ఈ వివాదం ఎటు మలుపు తిరుగుతుందో కానీ పేర్ని నాని తెగేదాకా లాక్కుంటున్నారన్న అభిప్రాయానికి వైసీపీ వర్గాలు వస్తున్నాయి.