జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తులపై ఇప్పుడే మాట్లాడబోనని.. తన పొత్తులు ప్రజలతోనేనని ప్రకాశం జిల్లాలో ఓ పొలిటికల్ స్టేట్ మెంట్ ఇచ్చారు. నిజానికి ఎవరైనా ఎన్నికలకు ముందే పొత్తుల గురించి మాట్లాడారు. ఈ తరహా రాజకీయానికి పవన్ కల్యాణ్ ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారని అనుకోవచ్చు. అయితే పవన్ ఈ ప్రకటన చేయగానే వైసీపీ నేతలు బిలబిలమంటూ బయటకు వచ్చేశారు. ప్రకాశం జిల్లాలో అలా సభ ముగియగానే ఇలా పేర్ని నాని మీడియా ముందుకు వచ్చి.. పవన్ ఏం మాట్లాడారో.. రివ్యూ చేసేశారు. ఆ తర్వాత అంటి రాంబాబు ఆ బాధ్యత తీసుకున్నారు. పవన్ కల్యాణ్ బీజేపీని వదిలేశారని విశ్లేషించి విమర్శించడం ప్రారంభించారు.
జనసేన పార్టీ బీజేపీతో పొత్తులో ఉంది. ఆ విషయం ఆ రెండు పార్టీలది. పవన్ కల్యాణ్ ఎలాంటి ప్రకటనలు చేసినా బీజేపీ మాత్రం ఒకటే మాట చెబుతోంది. తాము పొత్తుల్లో ఉన్నామని కలిసే పోటీ చేస్తామని చెబుతోంది. పవన్ కూడా తాము బీజేపీతో కటిఫ్ చేసుకున్నామని ఎక్కడా చెప్పడం లేదు. అందుకే రెండు పార్టీల నేతలు ఎవరూ పొత్తులకు వ్యతిరేకంగా ప్రకటనలు చేసుకోవడంలేదు.కానీ బీజేపీపై ఎక్కడా లేని సానుభూతి చూపిస్తూ అంబటి రాంబాబు ప్రకటనలు చేసేస్తున్నారు. బీజేపీని పవన్ వదిలేశారని అంటున్నారు. అసలు జనసేనతో పొత్తులపై బీజేపీకి లేని బాధ వైసీపీకి ఎందుకన్న ప్రశ్న అంబటి రాంబాబు లాంటి నేతల ప్రకటనల వల్ల వస్తోంది.
వైసీపీ జనసేన పార్టీని చూసి ఆందోళన చెందుతోందని ఆ పార్టీపై పెడుతున్న ఫోకస్తోనే అర్థమైపోతుంది. ఆ పార్టీని ఎవరితోనూ కలవనీయకుండా ఉండాలని ఒంటరిగా లేదా బీజేపీతో కలిసి పోటీ చేసేలా చూడాలని రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు. దమ్మూ, ధైర్యం ఉందా అన్న స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. ఇవన్నీ ఎంత వరకూ వర్కవుట్ అవుతాయన్నది తర్వాత విషయం కానీ.. ఇప్పటికైతే.. వైసీపీ ఎందుకు జనసేన విషయంలో అంత కంగారు పడుతోందన్నది మాత్రం చర్చనీయాంశం అవుతోంది. ఈ పరిస్థితిని జనసైనికులు బలంగానే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.