ఎన్ని ఇబ్బందులు పెట్టినా వైసీపీని వీడబోనని పేర్ని నాని గొప్పగా ప్రకటించారు. ఎందుకంటే ఆయన బార్యకు లభించిన ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని పోలీసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బియ్యం మాయం కేసులో ఆమెపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని గోడౌన్ల నుంచి బియ్యం తరలించారని.. తప్పు ఒప్పుకుని డబ్బులు కట్టారని కోర్టు దృష్టికి తీసుకెళ్తున్నారు. దీనిపైనే స్పందించిన పేర్ని నాని.. తాను పార్టీ వీడబోనని అంటున్నారు. ఆయనను పార్టీ వీడాలని ఎవరు అన్నారో కానీ.. తాను చేసిన అక్రమాలపై కేసులు వేయడం.. అంటే.. తనను వైసీపీ నుంచి వెళ్లిపొమ్మని చెప్పడం అని ఆయన తీర్మానించుకున్నారు.
నిజానికి పేర్ని నానిని చేర్చుకునే పార్టీ ఇప్పుడు కనిపించడం లేదు. ఆయనను టీడీపీలో చేర్చుకునే చాన్స్ లేదు. ఆయన నీడ టీడీపీ మీద పడితే.. జోగి రమేష్ ఇష్యూలో ఏం జరిగిందో అంత కంటే ఎక్కువ జరుగుతుంది . ఆయన నోరు అంత అంత ఘోరంగా ఉపయోగిచుకున్నారు. జనసేనలో అయితే అసలు సాధ్యం కాదు. జగన్ వ్యూహంలో భాగంగా పవన్ ను అత్యంత ఘోరంగా విమర్శించారు. దీంతో జనసైనికులు పేర్ని నానిని ఆహ్వానించే పరిస్థితి లేదు. ఈ రెండు పార్టీల అంగీకారం లేకుండా బీజేపీ కూడా చేర్చుకోదు. మరి పేర్ని నాని ఎక్కడికి వెళ్తారు.
పేర్ని నానికి వైసీపీ తప్ప మరో పార్టీ గత్యంతరం లేదు. ఆ విషయం ఆయనకూ తెలుసు. తన భార్య అరెస్టు నుంచి కాపాడుకోవడానికి తాను గతంలో ఆజ్ఞాతంలోకి వెళ్లానని చెప్పుకున్నారు. ఇప్పుడు హైకోర్టు ఆమె బెయిల్ రద్దు చేస్తే ఇక ఎక్కడికీ పోలేరు. నిజానికి పేర్ని నాని భార్య జైలుకు పోకుండా కాపాడుకోలేకపోతే ఆయన కుటుంబంలోనూ సమస్యలు వస్తాయి. అప్పుడు జగన్ కూడా చక్కదిద్దలేరు. రాజకీయాల్లో మితిమీరితే ఎలా ఉంటుందో పేర్ని నాని పరిస్థితే ఉదాహరణ.